– చివరి టెస్టులోనూ భారత్ ఓటమి
– 5-0తో హాకీ టెస్టు సిరీస్ ఆసీస్ వశం
పెర్త్ (ఆస్ట్రేలియా) : హాకీ ఇండియా దారుణంగా నిరాశపరిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధతలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. అక్కడ ఐదు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-5తో వైట్‌వాష్ చేసుకుని పరిపూర్ణ పరాజయం చవిచూసింది. శనివారం జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 3-2తో గెలుపొందింది. నామమాత్రపు మ్యాచ్‌లో హాకీ ఇండియా ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. కానీ ఆసీస్ ఎదురుదాడిని సమర్థవంతంగా నిలువరించటంలో విఫలమైంది. నాల్గో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. 20 నిమిషంలో ఆసీస్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా జెరెమీ హేవార్డ్ గోల్ కొట్టాడు.
దీంతో ఆసీస్, భారత్ 1-1తో సమవుజ్జీగా నిలిచాయి. 38, 39 నిమిషాల్లో వరుసగా గోల్స్ కొట్టిన ఆస్ట్రేలియా 3-1తో ముందంజ వేసింది. విలియట్, బ్రాండ్‌లు ఆసీస్‌కు వరుస గోల్స్ అందించారు. 21 ఏండ్ల బాబీ సింగ్ 53వ నిమిషంలో గోల్ సాధించినా.. భారత్ స్కోరు సమం చేయలేకపోయింది. దీంతో 5-0తో టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. హాకీ ఇండియాకు కనీసం ఊరట విజయమైనా దక్కలేదు. ఇదిలా ఉండగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హాకీ ఇండియా పారిస్ ఒలింపిక్స్‌లో కఠిన డ్రా ఎదుర్కొంది. ఆస్ట్రేలియా, బెల్జియం, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్‌తో కలిసి గ్రూప్ దశలో పోటీపడనుంది.