ఓటమే వారికి శిక్ష కావాలి

Defeat is their punishment– రైతులను చంపినవారిని రైతులే ఓడించాలి
–  కేంద్ర వ్యవసాయ మంత్రిని ఓడించడం రైతుల చారిత్రక బాధ్యత : కిసాన్‌ మహా పంచాయత్‌లో రైతు నేతలు
న్యూఢిల్లీ : రైతులను చంపినవారిని రైతులే ఓడించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయ మంత్రిని ఓడించటం రైతుల చారిత్రక బాధ్యత అని తెలిపారు. మధ్యప్రదేశ్‌ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దీమాని (ఖాదియహార్‌)లో భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ మహా పంచాయత్‌లో వ్యవసాయ మంత్రిపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. సంయుక్త కిసాన్‌ మోర్చా తీసుకున్న నిర్ణయం మేరకు ‘కార్పొరేట్‌ను తరిమికొట్టండి, బీజేపీని శిక్షించండి, దేశాన్ని రక్షించండి’ అన్న ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని మొరెనా, డిమానీల్లో కూడా ఎస్‌కెఎం నేతలు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్‌కేఎం నేత పి కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం ఎంఎస్‌పీతో కూరగాయలు కొనుగోలు చేస్తున్నదని, కూరగాయలకు రూ.2,820 మద్దతు ధర ఇచ్చిందని తెలిపారు. అలాంటప్పుడు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నదని ప్రశ్నించారు. కిసాన్‌ సంఘర్ష్‌ సమితి జాతీయ అధ్యక్షుడు సునీలం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనేకాదు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనూ రైతులకు ఆరు గంటల కరెంటూ అందడంలేదన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి లాఠీచార్జీలు ఎదుర్కోవాల్సి రావడం దారుణమన్నారు. మందసౌర్‌లో ఆరుగురు రైతులను కాల్చిచంపడానికి కారణమైన బీజేపీ ప్రభుత్వాన్ని, రైతులపై బలవంతంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను ప్రయోగించి 725 మంది రైతులు అమరులవ్వడానికి కారణమైన కేంద్ర వ్యవసాయ మంత్రిని ఓడించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో రైతులను చితకబాదడంలోనూ, రైతులను కార్లతో తొక్కించి హతమార్చడంలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌దే బాధ్యత అని తేరారు ఫార్మర్స్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షుడు తేజేంద్ర సింగ్‌ విర్క్‌ అన్నారు. రైతులపై దాడి చేసిన వారిని ఓడించి శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.