బీజేపీ ఓటమితోనే రాజ్యాంగ పరిరక్షణ

Defeat of BJP is the preservation of constitution– మద్దతు పార్టీలకూ గుణపాఠం చెప్పాలి
– భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు
– ఏపీ సదస్సులో గళమెత్తిన పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు
అమరావతి : రాజ్యాంగానికి, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు హాని తలపెట్టిన బీజేపీని, ఆ పార్టీ మిత్రపక్షాలను, మద్దతుదార్లను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. దేశాన్ని అన్ని విధాలా అధోగతి పట్టించిన, సహజ వనరులతో సహా ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న, ప్రజల్లో మత, కుల వైషమ్యాలకు కారణమైన మోడీ ప్రభుత్వంపై పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేసింది. ప్రమాదంలో పడ్డ దేశాన్ని రక్షించుకొనేందుకు యావత్‌ పౌర సమాజం ముందుకు రావాలని కోరింది.మోడీ ప్రభుత్వం మూటగట్టుకున్న దుష్పరిణామాలపై సాధారణ ప్రజలకు వివరించి చైతన్యపర్చే కర్తవ్యాన్ని భుజానికెత్తుకోవాలని తీర్మానించింది. ‘మోడీ హఠావో- దేశ్‌ బచావో’ నినాదంతో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్‌ కమిటీ శుక్రవారం విజయవాడ సిద్దార్ధ ఆడిటోరియంలో సదస్సు నిర్వ హించింది. ఈ కార్యక్రమానికి వేదిక కన్వీనర్‌, రైతు నాయకుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌, ఆప్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని సందేశాలిచ్చారు.
మను ఆధారిత రాజ్యాంగం వస్తుంది: వడ్డే హెచ్చరిక
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలిస్తే మను ఆధారిత రాజ్యాంగం తెస్తుందని వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే.. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రాసినప్పుడే ఆర్‌ ఎస్‌ఎస్‌ ఈ రాజ్యాంగం తమకు అంగీకారం కాదందన్న విష యాన్ని గుర్తు చేసుకోవాలి. దేశం రాష్ట్రాల సమాహారం అని రాజ్యాంగం పీఠికలో పేర్కొనగా ఫెడరల్‌ స్ఫూర్తికి మోడీ సర్కారు విఘాతం కలిగిస్తోంది. సోదర భావంతో మెలగాల్సిన ప్రజల్లో మతం చిచ్చుపెట్టి లౌకికతత్వానికి ముప్పు తెచ్చిపెట్టింది. మన రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసింది. ఎన్నికల్లో బీజేపీని, మిత్రపక్షాలను ఓడించేందుకు అవి శ్రాంతంగా కృషి చేయాలి. నియోజకవర్గాల్లో ఆ లక్ష్యం కోసం పని చేయాలి…
అయోధ్యతో ఎన్నికలకు: అజీజ్‌పాషా
అయోధ్య రామాలయాన్ని చూపించి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని సీపీఐ జాతీయ నాయకులు అజీజ్‌ పాషా అన్నారు. గత ఎన్నికల్లో మల్లే పుల్వామా వంటివి ఈసారి లేవు. పూరి శంకరాచార్య వంటి వారు అభ్యంతరం చెప్పినా వినట్లేదు. మూడు రాష్ట్రాల్లో గెలుపు చూసి భారీ మెజార్టీతో కేంద్రంలో వస్తామంటోంది గోడీ మీడియా. గెలిచిన రాష్ట్రాల్లో పెద్ద మెజార్టీ ఏమీ లేదు. ‘ఇండియా’ బ్లాక్‌ కలిసి ఉన్నట్లయితే బిజెపికి ఆ గెలుపు సాధ్యమయ్యేది కాదు. అయోధ్య వెళ్లకపోయినా కాంగ్రెస్‌ కూడా మృదు హిందుత్వ అంటోంది. కాంగ్రెస్‌ కర్ణాటక, తెలంగాణాలో వలే రావాలి తప్ప వేరే విధంగా కాదు. బీజేపీ వలన దేశానికి ప్రమాదం. ప్రజలు ఐక్యంగా పోరాడాలి.
ప్రజా ఉద్యమాలే రక్ష: వి శ్రీనివాసరావు
ప్రజా ఉద్యమాలతో రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీ మద్దతుదార్లను ఎన్నికల్లో ఓడించాలన్నారు. ‘ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేడు. ఏం చేసిందని వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీ పల్లకి మోస్తున్నాయి. బోయిలుగా ఎందుకు మారాయి? పదవుల కోసం, ఆస్తుల కోసం బీజేపీ వద్ద మోకరిల్లి మీ వెనుక ఉన్న కోట్లాది ప్రజానీకానికి ద్రోహం చేస్తారా? ఓట్ల కోసం వచ్చినప్పుడు ఆ పార్టీలను నిలదీసి ప్రశ్నించండి. రైతు ఉద్యమానికి మోడీ తలవంచారు. ఇది ప్రజల విజయం. ప్రజా ఉద్యమాలకే మోడీ, ఆయన మద్దతుదార్లు భయపడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కార్మికుల ఉద్యమం వల్లనే జరగలేదు. ఇది ప్రజల విజయం. అంగన్‌వాడీలు వీరోచితంగా పోరాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారి వెంట పార్టీలు నడుస్తాయి…
రైతు ఉద్యమం స్ఫూర్తిగా బలపడాలి : రాకేశ్‌ తికాయత్‌
మోడీని ఓడించడానికి ఢిల్లీ రైతు పోరాటం స్ఫూర్తిగా దేశ వ్యాప్తంగా ఉద్యమం బలపడాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జాతీయ నాయకులు రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. మతోన్మాదం దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ప్రజలందరూ దుఃఖిస్తున్నారు. రైతులకు ఎంఎస్‌పీ పెద్ద సమస్యగా ఉంది. ఏ రైతూ సంతోషంగా లేడు. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లోకి రైతులను పెట్టేందుకు కుట్ర జరుగుతోంది. వీటన్నింటికీ విరుగుడు మహోద్యమమే. అందుకు అందరూ సిద్ధపడాలి. దేశం ప్రజాస్వామ్య పునాదులపై నడుస్తోంది. కాపాడుకొనేందుకు సమాయత్తం కావాలి..
ప్రజల మద్దతు కూడగట్టాలి : బివి రాఘవులు
బీజేపీని ఓడించేందుకు ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టే కర్తవ్యాన్ని తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, సమాఖ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తోంది. ఇప్పుడు అడ్డుకోకపోతే తిరిగి రక్షించుకోవడానికి ఎంతో కష్టపడాలి. స్వాతంత్య్రోద్యమ త్యాగాల ద్వారా రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగ ధ్వంసాన్ని నిరోధించకపోతే దేశానికి, స్వాతంత్య్రానికి ద్రోహం చేసినట్లే. న్యూస్‌క్లిక్‌పై దాడులు, మీడియాపై ఆధిపత్యం, జర్నలిస్టులపై కేసులు బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం. సినిమాలపైనా దాడే. నటి నయనతారపై అక్కసు చూస్తున్నాం. సైన్స్‌ కాంగ్రెస్‌ జరగకుండా చేశారు. ఫెడరలిజం ఉండటం వల్లనే రాష్ట్రాలు ఇలాగైనా ఉన్నాయి. ఈ సభలో వైసీపీ, టీడీపీ, జనసేన లేవు. ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీకి ఏపీలోనే ఎక్కువ బలం. బిజెపి వద్ద మూడు పార్టీలూ సాగిలపడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను బీజేపీ మింగుతుంది. మూడు పార్టీలూ ఆలోచించుకొని ప్రజల వెంట నడవాలి. లేకపోతే సాగిలపడే పార్టీలను పక్కకుతోసేసి ప్రజలు తమను తాము రక్షించుకుంటారు’…
మోసం చేసే బీజేపీ అక్కర్లేదు : తమ్మారెడ్డి
ప్రజలను మోసం చేసే బిజెపి దేశానికి అవసరం లేదని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ అన్నారు. పద్మావతి సినిమాకు మద్దతిచ్చినందుకు హైదరాబాద్‌లోని ఒక బీజేపీ ఎంఎల్‌ఎ తెలుగు సినీ పరిశ్రమ కుటుంబాల్లోని మహిళలందరూ చెడ్డవాళ్లని కామెంట్‌ చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిన తరుణంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు చైతన్యం ప్రదర్శించాలని భారత రాజ్యాంగ హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కె విజయరావు అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మంచి వారినే ఎన్నుకోవాలని ఏఐటీయూసీ జాతీయ నాయకులు వహీదా నిజాం సూచించారు. దేశంలో పరోక్ష ఎమర్జెన్సీ ఉందని, ఎపికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ నాయకులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటోందని, ప్రజా ఉద్యమాలతో ఆ అధ్యాయాన్ని తిరిగి రాయాలని జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రొఫెసర్‌ ఆనంద్‌ కుమార్‌, ఎఐకెఎస్‌ జాతీయ నాయకులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడారు.
ఇక్కడా ‘ఇండియా’ ఉండాలి : జెడి శీలం
బీజేపీ మిత్రులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి బలపడాలని కాంగ్రెస్‌ జాతీయ నాయకులు జెడి శీలం అన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పోరాడే వారందరూ ఒక వేదిక మీదికి, కాంగ్రెస్‌తో కలిసి రావాలన్నారు. ‘రాష్ట్రంలో బాబు, జగన్‌, పవన్‌.. బీజేపీగా నడుస్తున్నాయన్నాయి. బీజేపీ కంటే కాంగ్రెస్‌ బెటర్‌. దౌర్భాగ్యంలో మహాభాగ్యం కాంగ్రెస్‌. మాతో అందరూ కలిసి రావాలి’ అని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు.
తీర్మానాలు
అంగన్‌వాడీల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సీఐటీయూ ఏపీ నాయకులు సిహెచ్‌ నర్సింగరావు, రాజకీయ తీర్మానాన్ని ఏఐటీయూసీ నాయకులు ఓబులేషు, సంతాప తీర్మానాన్ని కెవివి ప్రసాద్‌ ప్రవేశపెట్టారు. తొలుత అతిథులను ఏపీ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు వి వెంకటేశ్వర్లు వేదిక మీదికి ఆహ్వానించారు.