పార్టీలు మార్చే వారిని.. మతోన్మాదులు ను ఓడించండి..

– ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులను గెలిపించండి
– సిపిఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట: గెలవడానికి ఒక పార్టీ లోను,అధికారం చెలాయించేందుకు మరో పార్టీ మార్చే నాయకులను,మతం పేరుతో,ప్రాంతీయ తత్వం రెచ్చగొడుతున్న పార్టీల అభ్యర్ధులను చిత్తు చిత్తుగా ఓడించి, ప్రజలు ఎదుర్కొంటు సమస్యలు కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టులను గెలిపించాలని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎం.సాయి బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) బలపరుస్తున్న అశ్వారావుపేట అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల నామినేషన్ సందర్భంగా,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,ఎన్నికల కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన నామినేషన్ సభ ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఇచ్చినా,కాంగ్రెస్ కు మరో అవకాశం ఇచ్చినా,మతోన్మాద భాజపా ను గెలిపించిన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.నీళ్ళూ – నిధులు – నియామకాలు పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కు మరో అవకాశం ఇచ్చినా ఒరిగేదేమీ లేదని తెలిపారు.మతం పేరుతో సమాజంలో వైషమ్యాలు సృష్టించే ఆర్ఎస్ఎస్ భావజాల భాజపా తో సమాజంలో చీలిపోయి అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. అందుకోసమే కమ్యూనిస్టులను చుట్టూ సభలకు పంపితే ప్రజాప్రయోజన చట్టాలు రూపొందిస్తారు అని అన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు కోసం, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల, భవన నిర్మాణ కార్మికుల, హమాలి కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తున్న సిఐటియు నాయకులు అర్జున్ రావు ను అసెంబ్లీకి పంపితే మీ అందరి తరుపున చట్టబద్దంగా పోరాడటానికి వీలుంటుందని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి పిట్టల అర్జున్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం.జ్యోతి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, బి.చిరంజీవి నాయుడు,దొడ్డ లక్ష్మీనారాయణ, ముదిగొండ రాంబాబు, సీనియర్ నాయకులు యం.వి అప్పారావు,దమ్మపేట మండల కార్యదర్శి మోరంపుడి శ్రీనివాసరావు, చండ్రుగొండ మండల కార్యదర్శి ఏ.రామిరెడ్డి, అన్నపురెడ్డి పల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, నాయకులు బుర్ర వీరభద్రం, నాగ కృష్ణ,రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.