– సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం రూరల్
జెండాలు మార్చే నాయకులను ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంరూరల్ మండలంలోని చింతపల్లి, శ్రీరామ్ నగర్, కొండాపురం, సీతారాంపురం, అరేంపుల, బారుగూడెం, శ్రీ సిటీ, గొల్లగూడెం, నందనవనం, రుద్ర టౌన్షిప్ గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. పాలేరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లని, డబ్బుల సంచులతో ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు కొనేందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగురీతులో బుద్ధి చెప్పి నిజాయితీపరులకే పట్టం కట్టాలని కోరారు. 50 ఏండ్ల నుంచి పట్టిన జెండా వీడని చరిత్ర తనదన్నారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 2003లో 2600 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, గోదావరి జలాలను పాలేరులో కలిపి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మహాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.