
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ని గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం పిలుపునిచ్చారు. శనివారం సీపీఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి వెంకటేశ్వర కాలనీ శ్రీనగర్ కాలనీ పాతబస్తీ వివిధ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యల సాధన కోసం కార్మికుల కష్టజీవుల మహిళల మైనార్టీల హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టుల గొంతు అసెంబ్లీలో వినపడాలని,ప్రజా సమస్యల సాధన కోసం చర్చ జరుగాలంటే కమ్యూనిస్టులు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.అసెంబ్లీ అంటే కోట్లు ఉన్నవారే ఉండాలి అని రాజకీయాలను వ్యాపారంగా మార్చి ఎన్నికలు రాగానే మద్యం డబ్బుతో గెలవాలని చూసేవారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల సాధన కోసం పనిచేసే కమ్యూనిస్టు నిరంతరం కార్మికులు కర్షకులు కష్టజీవుల కోసం ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ముందు నిలిచి పోరాడి లాఠీలకు, తూటాలకు లెక్క చేయక ప్రజల కోసమే పని చేసే వారు కమ్యూనిస్టులని అన్నారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూ అవకాశవాద రాజకీయాలను తిప్పికొడుతూ ముందుకెళ్తున్న సిపిఐ(ఎం) అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అధిక మేజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
కార్మిక పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి..
నిరంతరం కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపు కోసం కార్మిక వర్గం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. శనివారం హమాలీ, పవర్లూమ్ ,నిర్మాణ రంగ కార్మికుల సమావేశాలు వేరువేరుగా నిర్వహించి దొడ్డి కొమురయ్య భవన్ నుండి పెద్ద గడియారం ఎన్జీ కాలేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాల చట్టం చేయకుండా పని గంటలు పీఎఫ్, ఈఎస్ఐ, హమాలీ సంక్షేమ బోర్డు, పవర్లూమ్ కార్మికులకు సిరిసిల్ల ప్యాకేజీ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ ను 20 ఏండ్లు నియోజకవర్గాన్ని ఏలి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వని కాంగ్రెస్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్మిక పోరాటాలలో భాగస్వాములు అవుతూ రైతు నాయకుడిగా ఎస్ఎల్బీసీ సాధన కోసం, రైతు గిట్టుబాటు ధర కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన రైతు నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వేరువేరు గా జరిగిన ప్రచార కార్యక్రమాలలో జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ , బూతం అరుణ, మధుసూదన్ రెడ్డి, గంజి నాగరాజు, నకెరికంటి సుందరయ్య ,సుంకరబోయిన వెంకన్న, మన్నే శంకర్, సురపల్లి భద్రయ్య, పరుశురాం,గౌతమ్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.