ఎంఇఐఎల్‌ ఐకామ్‌కు రక్షణ శాఖ కాంట్రాక్టు

– ఒప్పంద విలువ దాదాపు రూ.500 కోట్లు
హైదరాబాద్‌ : ఎంఇఐఎల్‌కు చెందిన ఐకామ్‌ టెలి లిమిటెడ్‌కు భారత రక్షణ శాఖ (ఎంఒడి) నుంచి భారీ కాంట్రాక్టు ఆర్డర్‌ దక్కింది. భారత సైన్యం కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంఒడితో రూ.500 కోట్ల విలువ చేసే ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంపొందించడానికి, ఆత్మనిర్భర్‌ భారత్‌ దృక్పథాన్ని సాకారం చేసుకునేందుకు, తయారీలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఐకామ్‌ టెలి లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 5/7.5 టన్‌ రేడియో రిలే కమ్యూనికేషన్‌ పరికరాల కంటైనర్లకు సంబంధించిన 1,035 ఉత్పత్తులను సమకూర్చాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ విలువ దాదాపు రూ.500 కోట్ల మేర ఉంటుందని వెల్లడించింది. ఈ కంటైనర్ల డెలివరీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. రేడియో రిలే కంటైనర్లు భారత సైన్యం మొబైల్‌ కమ్యూనికేషన్‌ డిటాచ్‌మెంట్‌ల దీర్ఘకాల ఆవశ్యకతను పరిష్కరిస్తాయి. కమ్యూనికేషన్‌ పరికరాలు విఫలమైన, నమ్మదగిన రీతిలో పనిచేయడానికి రక్షిత వాతావరణాన్ని అందించడానికి కంటైనర్లు ఉపయోగించబడతాయి. ఆ కంటైనర్‌లు ఆధీకృత ప్రత్యేక వాహనాలపై అమర్చబడతాయి. వాహనాలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా తరలించబడతాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఇంజనీరింగ్‌ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) గ్రూపునకు చెందిన ఐకామ్‌ దేశీయ తయారీదారుల నుండి సేకరించిన అన్ని పరికరాలు, ఉప వ్యవస్థలతో కంటైనర్‌లను ఉత్పత్తి చేస్తుంది. తాజా ఒప్పందం రక్షణ పరికరాల స్వదేశీ తయారీకి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐకామ్‌ పేర్కొంది.