పార్లమెంటు కేవలం రాజకీయ వైషమ్యాలకు వేదికగా మారుతోందా? అధికార పక్షమే అందుకు పూనుకుంటోందా? నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతులు అందుకు వంతపాడు తున్నారా? ప్రస్తుత శీతకాల సమావేశాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయా? ఇదే గనుక నిజమైతే అది ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం మాట అటుంచి క్షీణింపజేస్తుంది. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రభుత్వ విధా నాలను ప్రశ్నించడం, సమస్యలపై చర్చకు పట్టుబట్టడం ప్రతిపక్షాల విధి. అందుకోసం అవసరమైతే సభను స్తంభింపచేయడం వారి హక్కు. దాన్ని గౌరవించి ప్రశ్నకు సమాధానం చెప్పడం, చర్చకు అవకాశమివ్వడం ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా సభను నిర్వహించడం సభాపతుల కర్తవ్యం. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందుకు భిన్నం. సభలో సవాళ్లు ఎదురైన ప్రతీ సందర్భంలో దాటవేత ధోరణే అవలంబిస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇందుకు వంతపాడుతున్నారా అన్నట్టుగా సభాధ్యక్షులు సైతం నిత్యం సభను వాయిదాల పర్వం తొక్కించడం పార్లమెంటులో పరిపాటిగా మారింది. ఫలితంగా అదానీ అవినీతి, సంభాల్ హింస, మణిపూర్ అల్లర్లతో పాటు ప్రజలెదుర్కొంటున్న సమస్యలనేకం చర్చకు రాకుండా పోతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలోనే తొలిసారిగా రాజ్యసభ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం నమోదుకావడం ఈసమస్య తీవ్రతను ఎత్తిచూపుతోంది. దేశ ఉపాధ్యక్షుడు కూడా అయిన రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్‌ను పదవి నుండి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు తీర్మానం కోసం నోటీసు ఇవ్వడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. సభా నియమాలకు సంబంధించిన పలు సాంకేతిక కారణాల రిత్యా ఈ తీర్మానం ఓటింగ్‌ను ఎదుర్కొనే అవకాశం లేదు. ఒక వేళ ఉన్నా అది ఓడిపోవచ్చు. కానీ భారత పార్లమెంటులో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న రాజ్యసభ చైర్మెన్ సభ్యుల విశ్వాసం కోల్పోవడం, అవిశ్వాసానికి గురికావడం దేనికి సూచిక చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్ వైఖరి, పాలకపక్షానికి అనుకూలమైన బహిరంగ ప్రవర్తన అతని పక్షపాతానికి నిదర్శనంగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలకు అధికారపక్షం వారు అడ్డుపడుతుంటారు. కానీ రాజ్యసభలో ఆ పని సభాధ్యక్ష స్థానం నుండి దన్‌ఖరే చేయడం, తన హుందాతనాన్ని విస్మరించి సభ్యులపై వ్యక్తిగతమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు దిగుతూ కించపరచ డం పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలు చూసే వీక్షకులందరికీ తెలిసిన సంగతే. ఇది పదేపదే పునరావృతమవుతూ చివరికి సభకు అధ్యక్షస్థానమే ఆటంకంగా మారడం ప్రతిపక్షాల ఈ తీవ్రచర్యకు దారితీసింది.
పార్లమెంటుకు సభానాయకుడు, ప్రతిపక్షనేత ఇద్దరూ రెండు కళ్లలాంటి వారు. అది విస్మరించి..సభలో ప్రతిపక్షనాయకునికి మాట్లాడే అవకాశం కాదుకదా, కనీస ప్రాధాన్యతనివ్వకపోవడం, సభలో ప్రభుత్వ అభిప్రాయాలను బహిరంగంగా సమర్ధించడం, ప్రభుత్వ చర్యలనూ విధానాలను నేరుగా పొగుడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడటం వంటివి కూడా వారు అవిశ్వాసానికి కారణాలుగా చూపు తున్నారు. తామకు తరచూ సభనుండి వాకౌట్ చేయక తప్పని పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికార బీజేపీ సైతం నిత్యం ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు, ప్రభుత్వంపై విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించేందుకు, పార్లమెంటులో వారి అవకాశాలను, హక్కులను పూర్తిగా కుదించేందుకు బాహటంగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఇదంతా యాదృచ్చికమని అనుకోలేం. కారణాలేమైనప్పటికీ రాజకీయ రహితమైన ఉన్నత స్థానాలకు ఎన్నుకోబడినవారు అందుకు భిన్నంగా వ్యవహరించి అవిశ్వాసానికి గురికావడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు. సభా సంప్రదాయాలకు సంరక్షకునిగా, సభ్యుల హక్కులకు రక్షకునిగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఛైర్మన్…ఇలా ”పాలకపక్షానికి అధికార ప్రతినిధి”గా విమర్శలకు గురికావడం సరికాదు.
”ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి రక్షణ దుర్గం” అన్న భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు రాజకీయ పక్షాలకే కాదు, దేశ ఉపాధ్యక్షుల వారికీ గమనంలో ఉండాలి. స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పేందుకు ప్రతిపక్షానికి అవకాశమివ్వాలి. సభలో ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య చర్చలు వైషమ్యాలకూ శత్రుత్వానికీ దారితీసినప్పుడు.. చైర్మెన్ మధ్యవర్తిత్వం వహించి సభను సజావుగా ముందుకు నడిపించాలి. ఇది ఆయన తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవు తుంది. కానీ ఇందుకు భిన్నంగా రాజ్యసభ సజావుగా సాగడానికి చైర్మెనే అతిపెద్ద అంతరాయంగా విమర్శలపాలు కాకూడదు. కనుక ఇప్పటికైనా ఫిర్యాదుల యోగ్యతతో సంబంధం లేకుండా, సంస్థాగత సమగ్రత కోసం తాను రాజకీయ పోరాటానికి అతీతంగా ఉన్నానని తన విమర్శకులకు ఛైర్మెన్ భరోసానివ్వాలి.