లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సింది..

Deficiencies should be corrected.– పార్టీ నిర్మాణంపై దృష్టి పెడితే బావుండేది…
– బీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ పదం మాయమవుతుంది : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు
– ‘కాంగ్రెస్‌ 420’ హామీలపై బుక్‌లెట్‌ విడుదల
– వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలు బొందపెడతారంటూ కాంగ్రెస్‌కు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత పదేండ్ల పాలనతోపాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వైపు నుంచి కొన్ని పొరపాట్లు, తప్పిదాలు దొర్లిన మాట వాస్తవమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకుని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. తాము పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే బావుండేదని అన్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామనీ, తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం నుంచి ఈ సమీక్షలను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ సమావేశం… సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జోగు రామన్న, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులతో కేటీఆర్‌ మాట్లాడారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గ సమావేశంలో మొత్తం 26 మంది మాట్లాడారనీ, వారందరూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా తమ అభిప్రాయాలను వెల్లడించారని అన్నారు. మరో 176 మంది తమ అభిప్రాయాలను రాసిచ్చారని తెలిపారు. వాటన్నింటినీ అధినేత కేసీఆర్‌కు అందజేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి ఇవ్వలేదనే కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తాము అదే స్థాయిలో తాము తిప్పికొట్టలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద అత్యధిక ఉద్యోగాలు, అత్యధిక శాతం జీతాలు ఇచ్చింది తమ ప్రభుత్వమేనన్న విషయాన్నీ చెప్పుకోలేక పోయామని వాపోయారు. ఇలాంటి చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే బాగుండేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేల మీదున్న వ్యతిరేకత పార్టీని దెబ్బకొట్టిందని తెలిపారు. వారి మీద కోపంతోనే బీఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా ఓటేశాం తప్ప, కేసీఆర్‌ మీద అభిమానం లేక కాదంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకుంటున్నారనే విషయం తమ సమీక్షలో తేలిందని వివరించారు.
కాంగ్రెస్‌వి ‘420’ అబద్ధాలు…
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొత్తం 420 హామీలనిచ్చిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేశారు. వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చామనీ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలందరికీ పంచుతామని వివరించారు. తాను ఇచ్చిన వాగ్దానాలను వంద రోజుల్లో అమలు చేస్తానంటూ కాంగ్రెస్‌ హామీనిచ్చిందని గుర్తు చేశారు. అలా చేయకపోతే ప్రజలే ఆ పార్టీని బొందపెడతారని హెచ్చరించారు. రైతు బంధు డబ్బులు, వరికి బోనస్‌ ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రజలు నిలేస్తున్నారని హెచ్చరించారు. అధికారం కోసం కాంగ్రెస్‌ అలవిగాని విధంగా అడ్డగోలు హామీలను ఇచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన స్థాయిని మరిచి, బీఆర్‌ఎస్‌ పైనా, గత ప్రభుత్వంపైనా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నాయకుల ఆగడాలు కూడా మరీ ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని బీజేపీ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ఏనాడైనా తెలంగాణ సమస్యలపై మాట్లాడారా..? అని ప్రశ్నించారు. ఆయా పార్టీలకు చెందిన తెలంగాణ ఎంపీలు హైకమాండ్‌ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాల్లో గెలవాలనీ, లేదంటే పార్లమెంటు నుంచి తెలంగాణ పదమే మాయమైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాక (ఈనెల 22 తర్వాత) తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్లమెంటు స్థానాలతోపాటు జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో ఇలాంటి సమావేశాలను నిర్వహించటం ద్వారా క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేస్తామని తెలిపారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సైతం ఇదే రకమైన విధానాన్ని అనుసరిస్తామని కేటీఆర్‌ తెలిపారు.