కేంద్రం దిగజారుడు రాజకీయాలు

– కేరళకు ప్రకటించని సహాయం
– కేంద్రం వైఖరిపై ప్రతిపక్షాల విస్మయం
– మానవత్వం లేదు…విధానం శోచనీయం
– జాతీయ విపత్తుగా ప్రకటించాలి : జాన్‌ బ్రిట్టాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వాయనాడ్‌ విపత్తుతో అల్లాడుతున్న కేరళకు ఎలాంటి సహాయ ప్రకటన చేయకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో దిగజారుడు రాజకీయాలు చేసింది. బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో వాయనాడ్‌ విపత్తుపై జరిగిన ప్రత్యేక చర్చలో విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి కేరళకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ఉభయ సభల్లో జరిగిన చర్చపై స్పందించిన కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా.. ఈ రెండు డిమాండ్లపై స్పందించలేదు. అమిత్‌ షా తన సమా ధానంలో కేరళను ముందుగానే హెచ్చరించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఖాళీ చేయించలేదని తప్పుడు రాజకీయ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. జులై 23 నుంచి 26 వరకు కేరళను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ” జులై 23న తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేరళకు పంపాం. ప్రజలను తరలించేందుకు కేరళ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణ హెచ్చరిక వ్యవస్థ భారత్‌లో ఉంది’ అని షా అన్నారు. జులై 27, 28, 29 తేదీల్లో కేరళకు ఎలాంటి వార్నింగ్‌ ఇచ్చారో హౌంమంత్రి వివరించలేదు. ఉభయ సభల్లో చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కేరళకు సంఘీభావం తెలిపే బదులు రాజకీయం చేసేందుకు యత్నించారు. దీన్ని అమిత్‌ షా ప్రోత్సహించారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి: జాన్‌ బ్రిట్టాస్‌
వాయనాడ్‌ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ(ఎం) ఉపనేత జాన్‌ బ్రిట్టాస్‌ రాజ్యసభలో జరిగిన చర్చలో డిమాండ్‌ చేశారు. ”కేరళకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అనుమతించేందుకు సిద్ధంగా ఉండండి. కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. 2018లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం అనుసరించిన విధానాన్ని పునరావృతం చేయొద్దు. ఆ రోజు సైని కులు చేసిన సేవకు కేరళ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉచిత బియ్యం తరువాత వసూలు చేశారు” అని బ్రిట్టాస్‌ అన్నారు. కొందరు సభ్యులు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానం శోచనీయమని, వారికి సరైన రాజకీయాలు తెలియవని విమర్శిం చారు. కనీసం మానవత్వం లేదని, ప్రత్యేక సహాయానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని శివదాసన్‌ సూచించారు. వాతావరణ హెచ్చరికల కోసం ఆధు నిక రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) ఏఏ రహీమ్‌ కోరారు. వాయనాడ్‌తో సహా మలబార్‌లో రాడార్‌ వ్యవస్థ లేదు. కొచ్చి, తిరువ నంత పురం పాత వ్యవస్థను కలిగి ఉన్నాయని తెలిపారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఆర్థిక సహాయాన్ని అనుమతించాలని రహీమ్‌ కోరారు.