ధాన్యం కొనుగోలు లో జాప్యం…

– నెలలు తరబడి కొనుగోలు కేంద్రాల్లో నే….
– నిల్వ చేయడానికి అధిక వ్యయం…
– గత్యంతరం లేక ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోనే దళారులకు ధాన్యం అమ్మకం…
– కేంద్రానికి తరలించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి – సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య డిమాండ్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలనే ఉద్దేశ్యంతో ధాన్యం ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కొందరు అధికారులు వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు.నిబంధనలు పేరుచెప్పి నెలల కొద్ది కేంద్రాల లోకి వచ్చిన ధాన్యం ను కొనుగోలు చేయకుండా జాప్యం చేయడంతో విసిగి వేసారి పోయి రైతుల తోనే ప్రైవేటు కు అమ్ముకునే దయనీయ స్థితి అశ్వారావుపేటలో నెలకొంది కొనుగోలు కేంద్రాల లోనే ప్రైవేటు దందా..
వేసంగి ధాన్యం ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అశ్వారావుపేట సొసైటీ పరిధిలో అశ్వారావుపేట, ఊట్లపల్లి,జమ్మిగూడెంలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారు.ప్రభుత్వం క్వింటా ఒక్కంటికి రూ.1830 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది.ఈ ఏడాది ఆరంభం నుండి అకాల వానలు రావడంతో డ్యామేజ్ అయిన ధాన్యం ప్రతి గిం జను ప్రభుత్వం అదే ధరకు కొనుగోలు చేస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు.దీంతో రైతులు పెద్ద ఎత్తున పండించిన పంటను కొనుగోలు కేంద్రాల కు తరలించి అక్కడే ధాన్యాన్ని ఆరబోసుకున్నారు.వర్షాలు వస్తుండటంతో బరకాలు అద్దెకు తీసుకొని ధాన్యం కప్పి పగలు రాత్రుళ్లు అక్కడే ధాన్యం కుప్పలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికి 30 నుండి 40 రోజుల నుండి ధాన్యం కేంద్రాల లోనే ఉండి పోయింది.దాదాపు నాలుగైదు వేల బస్తాల ధాన్యం కేంద్రాలలో నిల్వ వుంది. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులు తేమ శాతం ను చూసి,టోకెన్ ఇచ్చి కాటా లు వేసి ఉంచిన ధాన్యం కూడ రెండు వేల బస్తాల కు పైగా కేంద్రాల లోనే 20 రోజుల నుండి పడి ఉంటుంది.మిల్లర్లు ముందుకు రావడం లేదు.లారీలు లేవు అని, క్వింటా కు పది కిలోలు కటింగ్ అయితే తీసుకుంటామని మిల్లర్లు చెపుతున్నారంటూ కొంత ఇలా ధాన్యాలను కొనుగోలు చేయకుండా కొనుగోళ్ళు ఏజెన్సీ వాళ్ళు తాత్సారం చేస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఏమి చేస్తామయ్యా ఇష్టమైతే ఉండు లేక పోతే అమ్మేసు కో అంటూ రైతులను హేళన చేస్తుండటంతో చేసే దేమిలేక విసిగి పోయిన కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యం ను ప్రైవేటు వ్యాపారులకు బస్తా ధాన్యం ను రూ.1350 లకు అమ్మేసుకుంటున్నారు.నేరుగా కొనుగోలు కేంద్రాల లోనే ధాన్యం ను గురువారం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసుకొని లారీల్లో లోడు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పుల్లయ్య కొనుగోలు కేంద్రిలను సందర్శించారు.ఈ సందర్భంగా రైతులు మూల నాగేంద్రరావు, శిరిగోడి దుర్గారావు, గంగారం శ్రీను, రాజు, తిరువూరు కృష్ణ, తగరం రాంబాబు, చిన్నంశెట్టి సోమయ్య, చిన్నంశెట్టి శ్రీను . శివమణి కంఠ, చెన్నూరి రామకృష్ణ బూదూరి మణికంఠ, సురేష్, శేషగిరి, చంద్రశేఖర్, రాజేష్, ఎం ప్రసాద్ వారి బాధలను పుల్లయ్య కు మొరపెట్టుకున్నారు.
అమ్మితే వచ్చే అసలు లాభం కంటే కేంద్రాల్లో నిల్వ చేయడానికే అధిక వ్యయం అవుతుందని వాపోయారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో కి వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా కొనుగోలు చేయాలని స్థానిక సొసైటీ అధ్యక్షులను, సీఈఓ లను డిమాండ్ చేసారు.