అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీలో జాప్యం

– తగ్గిన ఆయుర్వేద యూజీ సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇంకా కొనసాగుతుండటంతో వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి చెందిన యుజి సీట్ల సంఖ్య తగ్గినట్టు తెలిసింది. అవసరమైన సబ్జెక్ట్‌ కావాల్సిన బోధన సిబ్బంది లేకపోవడంతో ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌'(ఎన్‌ సిఐఎస్‌ఎం) యుజి సీట్లను 59 నుంచి 47కు తగ్గించారు. వరంగల్‌ కళాశాలను సందర్శించి, అక్కడి వాతావరణం, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించిన అధికార బందం నిబంధనల మేరకు అవసరమైన సబ్జెక్ట్‌లకు తగిన సిబ్బంది లేదని గుర్తించినట్టు సమాచారం. దీంతో 2024-25 విద్యాసంవత్సరానికి సీట్లను తగ్గించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఉంటే ప్రస్తుతం సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయర్వేద కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి వైద్యారోగ్యశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. సుమారు 36 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటి నియామకానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా లభించింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ నోటిఫికేషన్‌ మాత్రం జారీ కాలేదు. ఈ పోస్టుల కోసం దశాబ్ధకాలంగా సుమారు రెండువేల మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ పోస్టుల భర్తీ అంశంలో రాజకీయ ప్రమేయం ఉన్నట్టు ఆయుర్వేద కళాశాల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వం నుంచి మొదలు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు కొందరు ఉద్యోగుల అడ్డుపడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వరకే ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో యుజి సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉండేవి కావని కొందరు చెబుతున్నారు. మరోవైపు కొందరు అధికారులు పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో డిప్యూటేషన్‌ అధికారులు తిష్టవేశారు.అవసరమైన సబ్జెక్టులకు కాకుండా, ఇతర సబ్జెక్టులకు మాత్రం అవసరానికి మించి డిప్యూటేషన్‌ పద్ధతిన బోధన సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం సుమారు 14 మంది వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్నారు. క్లినికల్‌ వైపు పని చేస్తున్న కొందరు మెడికల్‌ ఆఫీసర్లు ఆయర్వేదంలో తిష్టవేశారు.వారు ఆయర్వేద కళాశాలలో పని చేస్తుండడంతో అక్కడ కొరత ఏర్పడింది. దీంతో అక్కడున్న ఉద్యోగులపైన అదనపు భారం పడుతోంది.