న్యూఢిల్లీ : మనీ లాండరింగ్‌తో ముడిపడిన ఉద్యోగాల కోసం భూమి కేసులో ఇడి చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీశా భారతి, హేమా యాదవ్‌లతో పాటూ మరికొంతమందిని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ముందుకు సాగడానికి అవసరమైన సాక్ష్యాధారాలు వున్నాయంటూ ఫిబ్రవరి 9న తమ ముందుకు హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్, నిందితులను ఆదేశించారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో వున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌కు కూడా వారంటు జారీ చేశారు. యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కత్యాల్‌తో పాటూ రైల్వే ఉద్యోగి, లబ్దిదారుడు హృదయానంద్ చౌదరి, షారిఖ్ బరిల పేర్లు కూడా ఈ చార్జిషీట్‌లో వున్నాయి. గతేడాది నవంబరులో కత్యాల్‌ను ఇడి అరెస్టు చేసింది. బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా సమన్లు జారీ అయినా ఆయన ఇంకా సాక్ష్యమివ్వాల్సి వుంది. ఇప్పటికే ఒకసారి సాక్ష్యమిచ్చిన డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌ను మరోసారి రావాల్సిందిగా ఇడి కోరింది. ఈ కేసులో ఇడి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తుందని భావిస్తున్నారు.