ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు

– మద్యం కంపెనీ పెర్నోడ్‌ రికార్డ్‌ ప్రాంతీయ అధిపతికి ఊరట
– బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో అరెస్టయిన మద్యం కంపెనీ పెర్నోడ్‌ రికార్డ్‌ ప్రాంతీయ అధిపతి బెనోరు బాబుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.
ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. కంపెనీ రీజినల్‌ హెడ్‌ బెనోరు బాబును గతేడాది నవంబర్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. బాబు తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించారు. బెనోరు బాబు కంపెనీలో జూనియర్‌ హౌదాలో ఉన్నారనీ, కంపెనీ పాలసీ మేకింగ్‌లో ఎలాంటి పాత్ర లేదని కోర్టుకు నివేదించారు. పాలసీ ఆమోదం పొందిన తర్వాతే కేసులోని ఇతర నిందితులను మాత్రమే బాబు కలిశారని సాల్వే కోర్టుకు తెలిపారు.
ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండా ఈడీ ఒకరిని 13 నెలల పాటు జైలులో ఉంచడానికి వీల్లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సీబీఐ, ఈడీ ఆరోపణల మధ్య వైరుధ్యాలు కనిపిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు బెనోరు బాబుకు బెయిల్‌ను మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.