కేజ్రీవాల్‌ బెయిల్‌పై సిబిఐ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సిబిఐ స్పందన తెలపాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్‌ నీనా బన్సాల్‌ కృష్ణ సిబిఐకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జులై 17కి వాయిదా వేశారు. అయితే కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లకుండా నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని జడ్జి పేర్కొన్నారు. సిఆర్‌పిసి సెక్షన్‌ 439 ప్రకారం హైకోర్టు, ట్రయల్‌ కోర్టు రెండింటికీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఉమ్మడి అధికారాలు ఉన్నాయని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది ఎ.ఎం. సింఘ్వీ పేర్కొన్నారు. లిక్కర్‌ పాలసీకి సంబంధించిన ఇడి మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కేజ్రీవా ల్‌ను జూన్‌ 25న తీహార్‌జైలులో సిబిఐ ప్రశ్నించింది. మరుసటి రోజు సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఐదురోజుల కస్టడీ కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. మూడు రోజుల కస్టడీ విధిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి అమితాబ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్‌ 29తో కస్టడీ ముగియడంతో ఈ నెల 12 వరకు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు ట్రయల్‌ కోర్టు ఆదేశించింది.