ఢిల్లీలో సాధారణంగా వర్షాలు పడవు. అరగంట సేపు వర్షం కురిస్తే బాగా పడినట్టు. అలాంటిది ఇటీవల ఏకబిగిన ఐదు గంటల పాటు వాన కురిసింది. దేశ రాజధాని మొత్తం నీటిలో మునిగిపోయింది. దాంతో వాహనదారుల, పాదచారుల రాకపోకలకు, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అండర్‌పాస్‌లో చిక్కుకుని, విద్యుదాఘాతానికి గురై, గోడ కూలి పదకొండు మంది చనిపోయారు. ప్రపంచ స్థాయి నిర్మా ణంగా పేరొందిన బహుళ అంతస్తుల భవనాల పార్కింగ్ కేంద్రాలు జలమయమయ్యాయి. న్యూఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలోని ఎంపీల ఇళ్లలోకి కూడా నీరు చేరింది. అంతేగాక, సామాన్య ప్రజలు, ప్రజాప్రతినిధుల నివాసాలు సైతం మురుగు నీటిలో మునిగిపోయాయి.88 ఏళ్ల ఢిల్లీ చరిత్రలో జూన్ 28న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భారీ వర్షపాతం నమోదైంది. 22.81 సెం.మీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధిపతి మృత్యుంజరు మహాపాత్ర తెలిపారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 28వ తేదీ ఉదయం గంటకు తొమ్మిది సెంటిమీటర్ల వర్షం కురిసింది. అదే సమయంలో, భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో వరద పరిస్థితి ఏర్పడింది.
పెరుగుతున్న జనాభా
ప్రపంచంలోకెల్లా అత్యంత జన సాంద్రత కలిగిన నగరాల్లో ఒకటి ఢిల్లీ. 2030 నాటికి ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా టోక్యోను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి 2018లో ప్రచురించిన ఒక నివేదికలో సూచించింది. 2030 నాటికి ఢిల్లీ జనాభా 3.9 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక్కడ జనాభా 2000లో 1.16 కోట్లు వుండగా, 2020లో 3 కోట్లు, 2023లో 3.2 కోట్లు వుంది. 52 కి.మీ పొడవు, 48.5 కి.మీ వెడల్పు కలిగిన ఢిల్లీ నగరానికి అనేక ప్రాంతాల నుంచి వలస వస్తుంటారు. నైపుణ్యం కలిగిన కార్మి కులు, వృత్తి నిపుణులను మొదలుకొని కూలీల వరకు ప్రతి రోజు కొత్త వారు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సగటు వార్షిక జనాభా వృద్ధి 2.7 శాతం వుంటుంది. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ, నిర్మాణాలు ఢిల్లీ స్థలాకృతికి అనుకూలంగా లేవని నిపుణులు అనేకసార్లు హెచ్చ రించారు. అవినీతి, నిర్వహణా లోపం వల్ల ఏర్పడిన సమస్యలే ఇవన్నీ.
అవినీతి, అశాస్త్రీయ నిర్మాణాలు
జి-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు 2022 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రగతి మైదాన్ సొరంగాన్ని ప్రారంభించారు. రెండేళ్ల క్రితం రూ.920 కోట్లతో నిర్మించిన ఈ సొరంగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షానికి కూడా 1.3 కి.మీ సొరంగంలో లీకేజీల కారణంగా నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. డ్రెయినేజీ సమస్యలు, నీటి ఎద్దడి నిత్యం సమస్యలుగా మారాయి. గత రెండు వర్షాల్లోనూ నీటి కారణంగా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజుల పాటు నగరం నిండుకుండలా ఉంది. సొరంగంలో నిర్మాణ పనులకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు.తూర్పు కిద్వారు నగర్‌లో కేంద్ర ప్రభుత్వ అధికారుల కోసం నిర్మించిన 14 అంతస్తుల భవనాన్ని అశాస్త్రీయంగా నిర్మించడం వల్లే దెబ్బతింది. నేలమట్టం కింద నిర్మించిన మూడంతస్తుల పార్కింగ్ ఏరియా నీటితో నిండిపోయింది. 24 గంటల పాటు వందలాది వాహనాలు నీట మునిగాయి. 4608 అపార్ట్‌మెంట్లు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో చాలా వరకు లిఫ్టులు పనిచేయవు. అలాగే గోడలకు పగుళ్లు వచ్చాయని ఖైదీలు చెబుతున్నారు. అండర్‌గ్రౌండ్ మెట్రో లైన్లు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పని చేశాయని, మరి కొన్నిచోట్ల మాత్రం నిర్మాణ లోపాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని స్పష్టమవుతోంది. రికార్డుల ప్రకారం ఢిల్లీలో దాదాపు వెయ్యి నీటి వనరులున్నాయి. ఇప్పుడు సుమారుగా 400 మాత్రమే చూడగలుగుతున్నారు. మిగిలిన 600 అదృశ్యమయ్యాయి. అంటే ఆక్రమణలకు గురయ్యాయి. వర్షపు నీరు ప్రవహించే చోటు లేకపోవడం ఢిల్లీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
(‘దేశాభిమాని’ సౌజన్యంతో)