– దీనితో సంబంధమున్న హైదరాబాద్ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు
– బాగానే లబ్ది పొందిన కాషాయపార్టీ
– 2022లో ఈ ఆరోపిత స్కామ్‌లో ‘అరబిందో’ డైరెక్టర్ శరత్‌ను అరెస్టు చేసిన ఈడీ
– ఆ తర్వాత ఐదు రోజులకే రూ.5 కోట్ల విలువగల బాండ్లు కొనుగోలు చేసిన ఆయన సంస్థలు
– ఆ మొత్తాన్ని ఎన్‌క్యాష్ చేసుకున్న
– బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల డేటాలో ఆసక్తికర అంశాలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ ఇటు రాజకీయంగా, అటు విరాళాల సేకరణ రెండు రకాలుగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ఈ ఆరోపిత స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే కీలక నాయకులను అరెస్టు చేసింది. అయితే, ఇదే కేసుతో సంబంధమున్న ఒక వ్యక్తికి చెందిన హైదరాబాద్ సంస్థ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం బహిరంగపరచిన ఎలక్టోరల్ బాండ్ల డేటా ఈ కేసులో ఆసక్తికర వివరాలను తెలియజేస్తున్నది.
న్యూఢిల్లీ : ఈ కేసుకు సంబంధముండి, అప్రూవర్‌గా మారిన ఒక వ్యక్తికి చెందిన సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి సమకూరిన విరాళాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈడీ అరెస్టు చేసిన ఐదు రోజులకే ఒక కంపెనీ (దీని డైరెక్టర్ కవిత సహ నిందితుడు) నుంచి బీజేపీకి రూ.5 కోట్లు విరాళంగా వచ్చి చేరాయి. ఈ కేసులో సదరు వ్యక్తి ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.
బీజేపీకి రూ.34 కోట్లకు పైగానే..
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త పి. శరత్ చంద్రారెడ్డి తన తండ్రి పివి రామ్ ప్రసాద్ రెడ్డి స్థాపించిన అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. నవంబర్ 10, 2022న మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అటు తర్వాత ఐదు రోజులకే.. అంటే నవంబర్ 15న అరబిందో ఫార్మా రూ. 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. వాటన్నింటినీ, ఆరు రోజుల తర్వాత.. అంటే నవంబర్ 21 బీజేపీ ఎన్‌క్యాష్ చేసుకున్నది. మొత్తమ్మీద కంపెనీ రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా.. అందులో ఏకంగా రూ.34.5 కోట్లు ఒక్క బీజేపీకే వెళ్లటం గమనార్హం. అలాగే, అరబిందో ఫార్మా కంపెనీ బీఆర్‌ఎస్‌కు రూ.15 కోట్లు, టీడీపీకి రూ.2.5 కోట్లు విరాళంగా సమర్పించింది.
2021-22లో ఆప్ ప్రభుత్వం కొన్ని నెలలపాటు లిక్కర్ పాలసీని అమలు చేసినపుడు, ఢిల్లీలో మద్యం లైసెన్స్ ప్రక్రియలో కిక్‌బ్యాక్‌లను తరలించటంలో శరత్ కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపణలు చేసింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తుల్లో శరత్, కవితలు ఉన్నారు. ఈడీ వీరిని ‘సౌత్ గ్రూప్’గా పేర్కొన్నది. సౌత్ గ్రూప్‌నకు చెందిన వ్యక్తులు గతంలో పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజరు నాయర్ ద్వారా ఆప్‌నకు సుమారు రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంపై నియంత్రణ సాధించేందుకు ఈ మొత్తాన్ని చెల్లించారనీ, 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ డబ్బును ఆప్ వినియోగించిందని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది.
గతేడాది జూన్ 1న, ఢిల్లీ కోర్టు శరత్‌ను ఈ కేసులో అప్రూవర్‌గా మార్చటానికి అనుమతించింది. సౌత్ గ్రూప్‌లోని మరో ఇద్దరు సభ్యులు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఆయన కుమారుడు రాఘవలు, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. కాగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసి ఇటీవలే టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తున్న విషయం విదితమే.
లిక్కర్ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 15న అరెస్టు చేసింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రెండ్రోజుల క్రితం అరెస్టయిన విషయం విదితమే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నాయకుడు మనీష్ సిసోడియా గతేడాది ఫిబ్రవరి నుంచి ఇదే కేసులో జైలులో ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజరుసింగ్ సైతం ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.
శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఆయన సంస్థలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్లు
కంపెనీ డైరెక్టర్ తేదీ మొత్తం
అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి నవంబర్, 15,2022 రూ.5 కోట్లు
అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి నవంబర్ 8, 2023 రూ.25 కోట్లు
ఏపీఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్ శరత్ చంద్రారెడ్డి నవంబర్ 8, 2023 రూ.10కోట్లు
యుజియా ఫార్మా
స్పెషాలిటీస్ లిమిటెడ్ రఘునాథన్ కన్నన్ నవంబర్ 8, 2023 రూ.15కోట్లు
(ఈయన కూడా అరబిందో డైరెక్టర్)
మొత్తం – రూ.55 కోట్లు