– చెరుకు రైతు సమాధి వద్ద రాత్రంతా నిద్రహరాలు
– పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన గ్రామస్తులు
నవతెలంగాణ – ఝరాసంగం: చెరుకు రైతుల సమస్యల పరిష్కారపరంగా గాని, జహీరాబాద్ యొక్క అస్తిత్వం కాపాడేపరంగా గాని, లేదా వ్యక్తిగతంగా తన యొక్క రాజకీయ భవిష్యత్తు సమాధి చేసినందుకు చాకలి దశరథ్ కు, ఢిల్లీ వసంత్ కు ఏం తేడా లేదని సామాజిక ఉద్యమకారుడు, జాతీయ రైతు నాయకుడు ఢిల్లీ వసంత్ అన్నారు. ప్రస్తుతం ఆయన చనిపోయారు.. కానీ నేను బ్రతికి కూడా చనిపోయానని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామనికి చెందిన చెరుకు రైతు చాకలి.దశరథ్ సమాధి వద్ద స్మశానంలో నిద్రించి వినూత్న నిరసన తెలిపారు. రాత్రంతా నిద్రహారాలు లేకుండా స్మశానం లోనే జాగరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవస్థ యొక్క రాజకీయ పార్టీల దుర్మార్గం వల్ల తమ జీవితాలని సమాధి చేశాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రైతుల కోసం ఆనాటి పరిస్థితులకు భిన్నంగా నేడు ఎలాంటి మార్పు జరగలేదని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ కోసం, వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఇలాంటి పరిస్థితులలో జహీరాబాద్ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే తన పరమధర్మమని పేర్కొన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ లో చెరుకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, వారికి దిక్కు.. దివానా! లేకుండా పోయిందన్నారు. చెరుకు రైతుల బకాయిలు ఇవ్వకుండా నేడు రైతులకు ఓట్లు అడగటానికి వచ్చే రాజకీయ నాయకులకు ప్రజలు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు సమాధి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం తెలిపారు.