కాలం ఏదైనా… సాయం సమయంలో వేడివేడిగా, కారంకారంగా ఏమైనా తినాలనిపిస్తే మొదటి ఆలోచన పకోడీల మీదకే మళ్లుతుంది. బయటి దుకాణాలలో కూడా అన్ని కాలల్లోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు. అయితే ఉల్లిగడ్డ, క్యాబేజీ లాంటివి కాకుండా కొంచెం వెరైటీగా ప్రయత్నిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా కొత్తగా చేసుకోగలిగే పకోడీ రుచులే ఇవి.
ఆకుకూరలతో...
కావల్సిన పదార్థాలు : మునగాకు- కప్పు, మెంతి ఆకులు- కప్పు, తోటకూర – కప్పు, అల్లం వెల్లుల్లి మిశ్రమం- రెండు చెంచాలు, పచ్చిమిర్చి మిశ్రమం – రెండు చెంచాలు, కారం – చెంచా, ఉప్పు – తగినంత, శెనగపిండి – కప్పు, బియ్యప్పిండి – అరకప్పు, కరివేపాకు రెబ్బలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, ధనియాల పొడి – రెండు చెంచాలు
తయారు చేసే విధానం : ముందుగా మునగాకు, మెంతి ఆకులూ, తోటకూర, కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. ఒకవేళ పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకుని ఈ పిండిని పకోడీల్లా వేసుకోవాలి. మంట తగ్గించి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి రుచిగా ఉంటాయి, శరీరానికి కావాల్సిన పోషకాలనూ అందిస్తాయి.
స్వీట్ కార్న్‌తో…
కావల్సిన పదార్థాలు : స్వీట్ కార్న్ – కప్పు, సెనగపిండి – మూడు చెంచాలు, మొక్కజొన్న పిండి – రెండు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం – రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు – కొన్ని (కారాన్ని బట్టి), సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా, పుదీనా ఆకులు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, గరం మసాలా – చెంచా, ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం : ముందుగా స్వీట్ కార్న్‌ని మిక్సీజార్‌లో వేసి ఓ నిమిషం తిప్పితే.. కొద్దిగా నలుగుతాయి. వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సెనగపిండీ, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలూ, ఉల్లిగడ్డ ముక్కలూ, పుదీనా ఆకుల తరుగూ, గరంమసాలా, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు చల్లుకుని తడిపొడిగా కలుపుకోవచ్చు. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తింటే చాలా బాగుంటాయి.
పెసలతో..
కావల్సిన పదార్థాలు : పెసలు – ఒకటిన్నర కప్పు, ఎండుమిర్చి – ఐదు, అల్లం, పచ్చిమిర్చి పేస్టు – నాలుగు చెంచాలు, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా, చాట్ మసాలా – చెంచా.
తయారు చేసే విధానం : పెసల్ని ఐదారుగంటల ముందు నానబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా రుబ్బుకుని ఉప్పు కలిపి పెట్టు కోవాలి. కరివేపాకు, ఎండుమిర్చిని కూడా మెత్తగా చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా పిండిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిపైన చాట్ మసాలా చల్లి వేడివేడిగా తింటే భలేరుచిగా ఉంటాయి. పెసల్ని మొలకలొచ్చాక పకోడీల్లా వేసుకుంటే మరీ మంచిది. మాంసకత్తులూ, ఇతర పోషకాలూ పుష్కలంగా అందుతాయి.
కాజు, పల్లీలతో..
కావల్సిన పదార్థాలు : జీడిపప్పు పలుకులు – కప్పు, పల్లీలు – కప్పు, పుట్నాల పప్పు – అరకప్పు, బియ్యప్పిండి – అరకప్పు, శెనగపిండి – కప్పు, కారం, ఉప్పు- తగినంత, వాము – కొద్దిగా, పుదీనా ఆకులు – కట్ట, గరంమసాలా – రెండు చెంచాలు, ధనియాల పొడి – రెండు చెంచాలు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : పుట్నాలపప్పును మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. అందులో మిగిలిన పదార్ధాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా చేసుకుని దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా కాజు, పల్లీల పకోడీ తింటుంటే కమ్మగా ఉంటుంది.
కూరగాయలతో..
కావల్సిన పదార్థాలు : శెనగపిండి – కప్పు, వాము, సోంపు రెండూ కలిపి చెంచా , క్యాప్సికం, క్యారెట్ – ఒక్కోటి చెంచా చొప్పున, కారం – చెంచా, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కట్ట, ధనియాల పొడి – చెంచా, మెంతికూర – కట్ట, నూనె – వేయించడానికి సరిపడా, బంగాళాదుంపలు- రెండు, సన్నగా తరిగిన పనీర్ ముక్కలు కొన్ని, ఉల్లిగడ్డ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదారు, నూనె – వేయించడానికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర చెంచా, మొక్కజొన్న పిండి – రెండున్నర చెంచాలు.
తయారు చేసే విధానం : వాము, సోంపును పొడిలా చేసుకోవాలి. కూరగాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పిండిని ఐదు నిమిషాలు నాననిచ్చి కాగుతోన్న నూనెలో పకోడీల్లా వేసుకుని, ఎర్రగా వేగాక తీసేయాలి. మంట తగ్గించి వేయించుకుంటే కూరగాయముక్కలు మాడకుండా ఉంటాయి.