– ఆప్ నాలుగు.. కాంగ్రెస్ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ
– త్వరలో ప్రకటన
న్యూఢిల్లీ : ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య ఢిల్లీలోని లోక్‌సభ సీట్ల పంపిణీ తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది. ఏడు లోక్‌సభ స్థానాలకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాలుగు చోట్ల ఆప్, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం. త్వరలో తమ పొత్తును ప్రకటించే అవకాశం ఉన్నది. చర్చలు చివరి దశకు చేరుకున్న తర్వాత దేశ రాజధానిలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాయని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. ఒక్కో పార్టీ పోటీ చేసే నిర్దిష్ట స్థానాలపై కూడా ఇరువర్గాలు అంగీకారం తెలిపినట్టు సమాచారం.ఆప్ దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెడుతుందని, కాంగ్రెస్ చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఆప్ వర్గాలు తెలిపాయి. యూపీ, మధ్యప్రదేశ్‌లలో లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్, సహచర ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది చోటు చేసుకోవటం గమనార్హం. పొత్తుపై చర్చలు ఆలస్యమయ్యాయని కేజ్రీవాల్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పొత్తు పెట్టుకోవటాన్ని తమ రాష్ట్ర నాయకులు వ్యతిరేకిస్తున్నందున తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్, కాంగ్రెస్‌లు ఇప్పటికే ప్రకటించాయి. పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉన్న విషయం విదితమే. ”పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసేందుకు పరస్పరం అంగీకరించాయి. దీనిపై ఎలాంటి శతృత్వమూ లేదు” అని కేజ్రీవాల్ ఇటీవల అన్నారు.2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆప్ ఓట్ల వాటా 18.1 శాతంగా ఉన్నది. ఆప్ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22.5 శాతం ఓట్లను సాధించి, ఏడు లోక్‌సభ స్థానాల్లో ఐదింటిలో రెండవ స్థానంలో నిలిచింది. బీజేపీకి 56.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.
‘కేజ్రీ’వాల్‌ను వదలని ఈడీ..
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వదలడం లేదు. లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు తాజాగా ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలని తాజా సమన్లలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ.. మరోసారి కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా, ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.