– ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి.
– పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలి.
– జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి ఉత్తమ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత ఆహార సంస్థకు (ఎఫ్.సి.ఐ కి) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ తో కలిసి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్ సీఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్‌ను వేగవంతం చేయడంపై దష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్ సీఐకి అందజేయాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ నుంచి ఎఫ్‌సిఐకి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారనీ, అయితే డెలివరీలలో పని తీరు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారని వివరించారు. పౌర సరఫరాల సంస్థ జనవరి 31 నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం బియ్యం, యాసంగి సీజన్‌కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలో ఆలస్యం జరుగకూడదని అధికారులను ఆదేశించారు. దీని కోసం తెలంగాణ మిల్లర్లందరూ రాబోయే రోజుల్లో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ పెట్టుబడిని తిరిగి పొందడం అనేది మిల్లర్లు అవసరమైనంత నాణ్యతలో ఎఫ్ సీఐకి బియ్యాన్ని పంపిణీ చేయడంపై ఆధారపడి ఉంటుందనీ, జాప్యం జరిగితే కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. గత 9-10 సంవత్సరాలలో రూ. 58,000 కోట్ల అప్పులు, రూ. 11,000 కోట్ల నష్టాల వలన సివిల్ సప్లైపై భారం పడిందని చెప్పారు. ఆలస్యం చేయడం వలన అదనంగా దాదాపు రూ. 3,000 కోట్ల వార్షిక వడ్డీ భారం పడనుందని అన్నారు. ఎఫ్‌సీఐకి నిర్ణీత పరిమాణంలో సీఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేయడంలో జాప్యం చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎఫ్ సీఐకి సకాలంలో బియ్యం పంపిణీ చేసేందుకు విధానాలను మెరుగుపరచాలనీ, ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. లక్ష్యం గడువుకు 21 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, లక్ష్యాన్ని సాధించడానికి రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. పీడీఎస్ బియ్యం నాణ్యత లోపించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కిలో కు రూ.39కి కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైకిల్ చేసే కేసులను అత్యంత సీరియస్‌గా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బియ్యం బస్తాకు 4-5 కిలోల తక్కువ బియ్యం అందుతున్నట్లు రేషన్ షాపు యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రేషన్ షాపుల యజమానులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.