అదానీ పోర్ట్స్‌ ఆడిటర్‌గా వైదొలగనున్న డెలాయిట్‌

న్యూఢిల్లీ : అదానీ పోర్ట్స్‌ కంపెనీకి ఆడిటర్‌గా వైదొలగాలని చేయాలని డెలాయిట్‌ నిర్ణయించింది. అదానీ గ్రూపు సంస్థల లావాదేవీల గురించి అమెరికాకు చెందిన సంస్థ హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిండెన్‌బర్గ్‌ ప్రస్తావించిన నిర్దిష్ట లావాదేవీలపై మే నెల్లో డెలాయిట్‌ తన అభిప్రాయం వెల్లడించింది. ఆడిటర్‌ చర్యతో అదానీ గ్రూపు ఆర్థిక నిర్వహణపై కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పన్ను రాయితీలను అనుచితంగా ఉపయోగించుకోవడం, సంబంధిత పక్షాల లావాదేవీలు సరిగా లేకపోవడం, గ్రూపుకున్న రుణ స్థాయిల గురించి హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేస్తూనే వుంది. వాటిని కంపెనీ తిరస్కరిస్తూనే వుంది. హిండెన్‌బర్గ్‌ ప్రస్తావించిన సంబంధిత పక్షాల లావాదేవీలపై స్వతంత్ర విచారణ నిర్వహించాలంటూ డెలాయిట్‌, అదానీ పోర్ట్స్‌ను కోరింది. కానీ కంపెనీ అందుకు అంగీకరించలేదు. దాంతో రాజీనామా వ్యవహారం బయటకు వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కథనాలపై డెలాయిట్‌ గానీ అదానీ పోర్ట్స్‌ గానీ వెంటనే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.