– తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
– శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈవీ చార్జింగ్ హబ్ ప్రారంభం
– 102 పాయింట్లతో అతిపెద్ద గ్లిడా ఈవీ చార్జింగ్ హబ్
నవతెలంగాణ-శంషాబాద్
ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కల్పిస్తే భవిష్యత్తు అంతా వాటిదేనని రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్స్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారి తుక్కుగూడ వద్ద గ్రిడా (ఆల్ లైట్స్ గ్రీన్) సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే అతి పెద్దదైన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రధానంగా తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిం దన్నారు. పర్యావరణం, శబ్ద కాలుష్యం నియంత్రణ, తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం అనే కాంక్షతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. అయితే, పెరుగుతున్న వాహనాలకు అనుగు ణంగా చార్జింగ్ సౌకర్యం లేకపోవడంతో కొందరు కొనుగోలు చేయ డానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యను తీర్చడం కోసం గ్లిడా సంస్థ ఎయిర్‌పోర్టు సమీపంలో ఒకే చోట 102 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సదు పాయం ఎంతో మందికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులకు ఏర్పడుతున్న సమస్యలను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పరిష్కరించుకోవచ్చన్నారు. గ్లిడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆవదేశ్ కె.ఝా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తమ సంస్థ మొదటి ఆవిష్క రణ వేదికగా ఉందన్నారు. ఇప్పటివరకు 88 చోట్ల ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇది దేశంలోనే అతిపెద్ద 89వ అవుట్ లెట్ అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనదారులకు చార్జింగ్, ఇతర సదు పాయాలు అందించడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.