నవతెలంగాణ-మంచిర్యాల
బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల ఐబి చౌరస్తా నుండి లక్షెట్టిపేట వరకు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో 40 సంవత్సరాలుగా బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు బీసీల డిమాండ్లు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగానే బీసీల సామాజిక రక్షణ భద్రతకు బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో భాగంగా బీసీల కులగణన చేపట్టాలని, లక్ష కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగులకు 50శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, కర్రే లచ్చన్న, శ్రీపతి రాములు, చంద్రగిరి చంద్రమౌళి, బండ సతీష్, పంపరి వేణుగోపాల్, పన్నీరు భీమ్‌రావు, కీర్తి భిక్షపతి, నంగునూరు లక్ష్మణ్, రాసమల్ల రాజేశ్వరి, ఆరెందుల రాజేశం, సంగం లక్ష్మణ్, రమేష్ వర్మ, బుడంకి కుమార్, కొంతం రాజు, అంకం సతీష్, మొగిలి లక్ష్మణ్ పాల్గొన్నారు.