ప్రమాదంలో ప్రజాస్వామ్యం

– దారుణంగా దిగజారిన భారత ఆర్థిక వ్యవస్థ
– పెరిగిన నిరుద్యోగం
– క్షీణిస్తున్న ప్రయివేటు పెట్టుబడులు
– భారత పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాదిమంది…
– ‘ది క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ పుస్తక పరిచయంలో పరకాల ప్రభాకర్‌
గడచిన పదేండ్లలో పెట్టుబడిదారులు బ్యాంకుల్లో చేసిన రూ.13 లక్షల కోట్ల అప్పుల్ని రద్దు చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి. దేశంలో 3 కోట్ల కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేసి, ఉపాధి కోసం వలసలు వెళ్లి పోయాయి. గ్రామీణ భారతం దుస్థితికి ఇది నిదర్శనం. ఇన్ని వైఫల్యాలు ఉన్నా, ఎన్నికలు జరిగిన ప్రతిచోటా బీజేపీ తిరిగి అధికారంలోకే వస్తున్నది. తమ మతానికి వారేదో చేస్తారనే మెజారిటీ ప్రజల భ్రమలే దీనికి ప్రధాన కారణం. అందువల్లే వారు ప్రశ్నించేందుకు సిద్ధపడట్లేదు. ఈ భ్రమల్ని తొలగించి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత కచ్చితంగా పౌరసమాజం, మేథావివర్గం, ప్రతిపక్ష రాజకీయపార్టీల పైనే ఉన్నది. దేశంలో దాదాపు 18 శాతంగా ఉన్న మైనారిటీ ప్రజల ఓట్లు తమకు అవసరమే లేదని బాహాటంగా ప్రచారం చేస్తున్నారంటేనే దేశం ఎంతటి ప్రమాదాల అంచున ఉందో అర్థమవుతున్నది. ఈ విద్వేష మాటలు ఎర్రకోటపై నుంచి వినిపించకముందే, సంస్కరిం చాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదస్థితిలో ఉందని ప్రముఖ రచయిత పరకాల ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతిపక్ష రాజకీయ పార్టీల వ్యూహ రచనలో ఎక్కడో లోపం కనిపిస్తున్నదని సందేహం వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మంచి పుస్తకం సంస్థల సంయుక్తాధ్వర్యంలో పరకాల ప్రభాకర్‌ రచించిన ”ది క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా” పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా 23 శాతం యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారనీ, నిరుద్యోగ సూచీల్లో భారతదేశం స్థానం లెబనాన్‌, లిబియా, ఇరాన్‌ వంటి దేశాల సరసన ఉన్నదని తెలిపారు. ఇదే అంశంలో పొరుగున్న ఉన్న బంగ్లాదేశ్‌ 12వ స్థానంలో ఉన్నదని ఉదహరించారు. దేశంలో 2014-15 నాటికి 120 మంది బిలియనీర్లు ఉంటే, గడచిన పదేండ్లలో వీరి సంఖ్య 145కి పెరిగిందనీ, అదే సమయంలో 84 శాతం మంది ప్రజల నికర ఆదాయం క్రమంగా పడిపోతున్నదని విశ్లేషించారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో తయారీరంగం పూర్తిగా కుదించుకుపోతున్నదనీ, కేంద్ర ప్రభుత్వం సాధించినట్టు చెప్తున్న 7 శాతం జీడీపీలో ఈ రంగానికి ఉన్న వాటా కేవలం 1.3 శాతం మాత్రమేనని తెలిపారు. విచిత్రంగా దేశంలో నైపుణ్యం కలిగిన శ్రామికులు కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నారనీ, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నా, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారెవరూ ఆసక్తి చూపట్లేదనీ, వారంతా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపుతున్నారని స్పష్టంచేశారు. గడచిన ఏడేండ్లలో ఏటా సగటున 1.5 లక్షల మంది భారతదేశ పౌరసత్వం వదులుకొంటున్నారనీ, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన స్కిల్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలు కేవలం ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నవే తప్ప, అమలు ఎక్కడా లేదన్నారు. ‘బేటీ బచావ్‌-బేటీ పడావ్‌’ నినాదంతో కేంద్రం ప్రకటించిన ఈ స్కీంకు కేటాయించిన నిధుల్లో 80 శాతం కేవలం ప్రచారం కోసమే ఖర్చు చేశారని ఉదహరించారు.
పుస్తక విశ్లేషణ చేసిన బహుగ్రంధ రచయిత ప్రొఫెసర్‌ ఇనుకొండ తిరుమలి మాట్లాడుతూ పెట్టుబడిదారులు తమ వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ కోసమే ‘హిందూత్వ’ను తెచ్చిపెట్టుకున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాసమస్యల ప్రస్తావన పక్కకు వెళ్లిపోయి, హిందూత్వం, లౌకికవాదం చూట్టూ తిరుగుతున్నాయని చెప్పారు. కానీ గ్రామీణంలో ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, వారికీ, రాజకీయపార్టీలకు మధ్య భారీ అంతరం కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
‘మంచిపుస్తకం’ సమన్వయకర్త కొండూరి వీరయ్య మాట్లాడుతూ ప్రజల భాష, ప్రతిపక్షాల భాష వేర్వేరుగా ఉంటున్నాయని అన్నారు. ‘హిందుత్వ’ అంటే హిందువులను దూషించినట్టు భావిస్తున్నారనీ, దీనికి ప్రత్యామ్నాయ పదాల సృష్టి జరగాలని చెప్పారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ అధ్యక్షత వహించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు పరకాల ప్రభాకర్‌ సమాధానాలు చెప్పారు.