ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Democracy at stake– రాష్ట్రంలో మార్పు కావాలి ..హస్తం రావాలి
– ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు దోచుకుండు
– ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌కు రెండు కండ్లు : విజయభేరి సభల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/జనగామ
రాష్ట్రంలో పాలనలో మార్పులు రావాలంటే.. హస్తం గుర్తుకే ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని, దొరల పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక వైపు ఉంటే కాంగ్రెస్‌, సీపీఐ, కోదండరాం మరో వైపు ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బుధవారం నిర్మల్‌ జిల్లా బోథ్‌, నిర్మల్‌ నియోజకవర్గాల విజయభేరీ సభల్లో పాల్గొన్న రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు బోథ్‌, నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆడె గజేందర్‌, శ్రీహరిరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోవడానికి జెండాలు.. ఎజెండాలు.. పక్కనపెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌కు రెండు కండ్ల లాంటి వారని, ఈ ఎన్నికల్లో చెరో ఆరు టికెట్లు కేటాయించి సమన్యాయం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఓట్లు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పిన కేసీఆర్‌.. తెలంగాణ పాలనలో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు ఈ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మెండిచెయ్యి చూపించారని విమర్శించారు. కుప్టి ప్రాజెక్టు పదేండ్లయినా నిర్మాణం జరగడం లేదని, మళ్లీ అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలు, గూడేలను పంచాయతీలను చేశామని గొప్పలు చెప్పిన కేసీఆర్‌.. వాటికి పక్కా భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల బకాయిలు సర్పంచ్‌లకు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని డబ్బులు తీసుకోవాలని మంత్రి దయాకర్‌రావు చెప్పారని ఇలాంటి వారిని దేనితో కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌.. ఇసుక మీద బ్యారేజీ కడుతారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని, అన్నారం కుంగిపోయిం దని.. సుందిళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గతంలో మంత్రులను సైతం ప్రగతిభవన్‌కు రానీయని ముఖ్యమంత్రి ప్రస్తుతం బడి పిల్లలకు కూడా గులాబీ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. అచ్చంపేట అడవుల్లో పుట్టిన నాకు ఆదివాసుల జీవన పరిస్థితులు తెలుసన్నారు.
అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటామని.. నెల రోజుల్లోనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, జడ్పీటీసీలు గోక గణేష్‌రెడ్డి, మల్లెపూల నర్సయ్య, ఎంపీపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జనగామ గడ్డ నుంచే కేసీఆర్‌ పతనం మొదలు
జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాలకు అడ్డా అయిన జనగామ గడ్డ నుంచే కేసీఆర్‌ను బొంద పెట్టాలన్నారు. పదేండ్లు అవినీతి పాలన సాగించిన కేసీఆర్‌ గడీల పాలనకు పాతర వేయాలన్నారు. తెలంగాణ తొలి, మలి దశలో పాల్గొన్న ఉద్యమకారు లకు కేసీఆర్‌ ద్రోహం చేశాడన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నైజాం రజాకార్లను తరిమిన అనుభవం ఈ ప్రాంత ప్రజలకు ఉంద న్నారు. పౌరుషాల ప్రాంతం జనగామ గడ్డ నుంచి కేసీఆర్‌ కమిషన్ల కోసం పంపిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలను పరామర్శించడానికి టైం లేదు కానీ పార్టీ ఫిరాయింపులు చేసుకుంటున్న పొన్నాలను పార్టీలోకి పిలవడానికి వెళ్లేందుకు మాత్రం సమయం ఉందా అని ప్రశ్నించారు. 40 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పొన్నాల లక్ష్మయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందో లేదో చివరి వరకు చూడకుండానే పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని, చేర్యాలను డివిజన్‌ కేంద్రంగా ప్రకటిస్తామ న్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డికి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నాయకులు పరమేశ్వరులు, మేడ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.