– ఎంపీల బహిష్కరణపై ‘ఇండియా’ నేతల ఆగ్రహం
– ఎంత విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఇండియా అంత పటిష్టమవుతుంది : ఖర్గే
– 146 మందిని సస్పెండ్ చేసి 60శాతం ప్రజల గొంతు నులిమారు : రాహుల్
– బీజేపీ మళ్లీ గెలిస్తే అసలు పార్లమెంటు ఉంటుందా? : ఏచూరి ప్రశ్న
– ప్రజాస్వామ్య రక్షణకు ఎంతటి మూల్యానికైనా సిద్ధం : శరద్‌పవార్
– జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల నిరసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ దేశ చరిత్రలో తొలిసారిగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వ చర్యను ప్రతిపక్షాల ఫ్రంట్ ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా.. బహిష్కరణకు గురైన ఎంపీలతో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, డీఎంకె నేత తిరుచ్చి శివ, సీపీఐఎంఎల్ నేత భట్టాచార్య, జేఎంఎం నేత మహువా మాంఝీ, ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు ఇతర ముఖ్య నేతలు ఈ నిరసనలో భాగంగా బీజేపీపై విరుచుకుపడ్డారు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే సరైన పోరాటమనీ, కలిసి నిలబడితే మోడీ ఏమీ చేయలేరని ఖర్గే అన్నారు. ”ఎంతగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే, ఇండియా అంత పటిష్టమవుతుంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చింది. కానీ పార్లమెంటులో నోటీసు ఇచ్చినా.. చదవడానికి కూడా అనుమతించలేదు. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ జగదీప్ ధన్ ఖర్ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి’ అని ఖర్గే విమర్శించారు.
ఎంపీలను బహిష్కరించి 60 శాతం ప్రజల గొంతును మోడీ అణచివేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యువత నిరుద్యోగితను కూడా రాహుల్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టంచేశారు.
ఇకపై పార్లమెంటు ఉంటుందా అనేదే సమస్య : ఏచూరి
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ ఉంటుందా? లేదా? అన్నదే ప్రధాన ప్రశ్న అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని గద్దె దించడం తప్పనిసరి అని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగ సారాన్ని మోడీ ధ్వంసం చేస్తున్నారు. బీజేపీని తరిమికొడతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు.