ప్రజాస్వామ్యం నాస్తి… నియంతృత్వం జాస్తి

NDSA reviews on Medigadda barrage– భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం
– మైనారిటీల హక్కులకూ విఘాతం
– స్వతంత్ర, సోషల్‌ మీడియాపై ఆంక్షలు
– భారత్‌లో పరిస్థితిపై వీ-డెమ్‌ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదని, అక్కడ నియంతృత్వం ప్రబలిందని ‘వెరైటీస్‌ ఆఫ్‌ డెమొక్రసీ’ (వీ-డెమ్‌) సంస్థ తేల్చి చెప్పింది. ఈ సంస్థ 179 దేశాలలో ప్రజాస్వామ్యం తీరుతెన్నులను పరిశీలించి మన దేశానికి 104వ ర్యాంక్‌ ఇచ్చింది. నైగర్‌, ఐవరీ కోస్ట్‌ దేశాల మధ్య భారత్‌కు స్థానం కల్పించింది. ప్రపంచంలో నియంతృత్వ పాలన అధికంగా కొనసాగుతున్న పది దేశాల్లో భారత్‌ కూడా ఉన్నదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పటికీ నియంతృత్వ పాలన నడుస్తోందని, అక్కడి సంస్థలు పాలకుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని తెలిపింది. 2018లో ప్రారంభమైన ఈ తరహా పరిపాలన 2023లో కూడా కొనసాగిందని ఎత్తిచూపింది. వాస్తవానికి 2013 నుండే ఈ పోకడలు కన్పిస్తున్నాయని తెలియజేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1975లో దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు అదే స్థాయికి దిగజారింది. ఇకపై భారత్‌ను ప్రజాస్వామిక దేశం అని ఎంతమాత్రం పిలవలేము. ప్రపంచంలో 42 దేశాల్లో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. ఆయా దేశాల్లో 2.8 బిలియన్ల మంది… అంటే ప్రపంచ జనాభాలో 35 శాతం మంది ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18 శాతం. నియంతృత్వ దేశాల్లో నివసిస్తున్న జనాభాలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు.
అన్ని సూచికలూ అంతే
ఇక ప్రజలు, మైనారిటీల హక్కుల పరిరక్షణ విషయంలో భారత్‌ స్థానం 92. ఇక్కడ కూడా మన స్కోరు ఘోరంగానే ఉంది. ప్రభుత్వ, మెజారిటీ ప్రజల దౌర్జానాల నడుమ మైనారిటీల హక్కులు మంటగలుస్తున్నాయి. దేశ రాజకీయ రంగంలో అన్ని సామాజిక గ్రూపులకు సమాన హక్కులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. ఈ విషయంలో మన స్థానం 137. అట్టడుగున ఉన్న 45 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. రాజకీయ ప్రక్రియల్లో పౌరులందరూ క్రియాశీలకంగా పనిచేస్తున్న దాఖలాలు కూడా కన్పించడం లేదు. ఈ సూచికలో భారత్‌ స్థానం 103. ఇది క్రమేపీ పడిపోతుండడం గమనార్హం.
ఏ ప్రజాస్వామిక వ్యవస్థలో అయినా సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఉంటుంది. సంప్రదింపుల్లో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో భారత్‌ ర్యాంక్‌ 101. మన దేశంలో ప్రభుత్వం సంప్రదింపులకు తావు లేకుండా చేసింది. అన్ని వ్యవహారాలు పాలకుల అభీష్టం మేరకే జరిగిపోతున్నాయి. అందుకే సూచికలో మన స్థానం దిగజారిపోయింది.
దక్షిణ, మధ్య ఆసియాలో…
ప్రపంచంలో దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల్లోనే ఎక్కువగా నియంతృత్వ పాలనలు నడుస్తున్నాయి. భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, కజక్‌స్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది నియంతృత్వ పాలన కింద నలిగిపోతున్నారు.
పడిపోతున్న సూచిక
దక్షిణాసియాలో సగటు జీవుల ఉదార ప్రజా స్వామ్య స్థాయి 1975 నాటి స్థాయికి పడిపోయింది. అది వియత్నాం యుద్ధం ముగిసిన కాలం. భారత్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుతం ఉదార ప్రజాస్వామ్య సూచికలో భారత్‌ స్థానం 104. దాని స్కోరు 0.28. ఎన్నికైన ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించిన ప్రజాస్వామ్య సూచికలో భారత్‌ ర్యాంక్‌ 110. ఈ విషయంలో దాని స్కోరు దారుణంగా ఉంది. దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ కనుమరుగవుతోంది. ప్రపంచంలో భారత్‌ సహా 18 దేశాల్లో ఈ పరిస్థితి కన్పిస్తోంది. ఈయూ సభ్య దేశమైన హంగరీ, ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే పరిస్థితి. 2008 నుంచే మొదలు
భారత్‌లో 2008 నుండే నియంతృత్వ పోకడలు
కన్పించడం మొదలైంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు క్రమేపీ విఘాతం ఏర్పడింది. స్వతంత్ర మీడియా, సామాజిక మాధ్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై వేధింపులు పెరిగిపోతున్నాయి. పౌర సమాజంపై కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని హిందూ జాతీయతావాద బీజేపీ ప్రభుత్వం విమర్శకుల నోరు మూయించేందుకు వారిపై రాజద్రోహం, ఉగ్రవాదం వంటి కేసులు పెడుతోంది. పరువునష్టం దావాలు వేస్తోంది. 2019లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (ఉపా) సవరించడం ద్వారా లౌకికవాదానికి కట్టుబడిన రాజ్యాంగ స్ఫూర్తిని
దెబ్బతీస్తోంది.
అంతంలేని ఆంక్షలు
దేశంలో మత స్వేచ్ఛ కనుమరుగైంది. మోడీ ప్రభుత్వం మత స్వేచ్ఛ హక్కుల్ని అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని భయపెడుతోంది. విద్యా రంగంలో సైతం అసమ్మతి నోటికి తాళం వేస్తోంది. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగడంలో, ప్రజలకు సకాలంలో సమాచారాన్ని చేరవేయడంలో, పౌర సమాజానికి అండదండలు అందించడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్న మీడియాపై కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. మీడియాపై ఆంక్షలు విధించడంలో ఎల్‌ సాల్వెడార్‌, భారత్‌, మారిషస్‌ అగ్ర స్థానంలో ఉన్నాయి. ఇంటర్నెట్‌ స్వేచ్ఛ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఇంటర్నెట్‌ సౌకర్యాలను నిలిపివేస్తున్న దేశాల్లో భారత్‌ ముందుంది. సామాజిక మాధ్యమాలపై కూడా ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రైతుల నిరసనలు, ఛలో ఢిల్లీ కార్యక్రమాలపై సోషల్‌ మీడియాలో వార్తలు రాకుండా ఆంక్షలు విధించిందని వీ-డెమ్‌ నివేదిక వేలెత్తి చూపింది.