మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ధ్వంసం

Democracy is destroyed under Modi regime– రాజ్యాంగాన్ని రక్షించేందుకు విద్యార్థులు పోరాడాలి
–  విద్యను పేదలకు దూరం చేసేందుకే ఎన్‌ఈపీ :ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల బహిరంగ సభలో అఖిలభారత అధ్యక్షులు వీపీ సాను
–  సైద్ధాంతికంగా ఎదుర్కొనే శక్తిలేకే భౌతికదాడులు
–  ఏబీవీపీ గూండాల దాడులపై ఆగ్రహం
–  సంగారెడ్డిలో కదం తొక్కిన విద్యార్థి లోకం
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ తమ హింధూత్వ ఎజెండాను అమలు చేసేందుకే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత అధ్యక్షులు వీపీ సాను అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కల్వకుంట్ల రోడ్డులో ఆర్‌ఎల్‌ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో సాను ప్రసంగించారు. లౌకిక భారత దేశంలో ఒకే దేశం, ఒకే పౌరసత్వం, ఒకే చట్టం అనే పేరుతో చట్టాలను తీసుకురావడం ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. ఇండియా పేరు మార్పు వెనకాల సంఫ్‌పరివార్‌ రాచరికపు భావజాలం దాగి ఉందని విమర్శించారు. మేడిన్‌ ఇండియా అని గొప్పలు చెప్పే మోడీ దేశంలో తయారు చేసిందేమీలేదని సాను అన్నారు. పేద వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఎన్‌ఈపీని తీసుకొస్తున్నారని తెలిపారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం వంటి అనేక అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారన్నారు. ప్రశ్నించే వ్యక్తులు, శక్తులతో సైద్ధాంతికంగా ఎదుర్కొనే శక్తి లేకనే సంఘపరివార్‌, ఏబీవీపీ శక్తులు దేశమంతటా అభ్యుదయ, సామాజికవేత్తలపై దాడులకు పాల్పడుతున్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వంతో జీవిస్తున్న దేశంలో హిందూత్వం పేరిట విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీని ఓడించేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఈపీని రద్దు చేసే వరకు ఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విద్యార్థి లోకం పోరాడాల్సి అవసరం ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.5177 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రియింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ విద్యార్థులు అర్ధాకలి, అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఐదు వేల పోస్టులకు డీఎస్సీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యారంగ సమస్యం పరిష్కారం కోసం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఎబీవీపీ దాడులకు పాల్పడుతోందని, దాడులకు భయపడే సంఘం ఎస్‌ఎఫ్‌ఐ కాదని, ప్రతిఘటించి తీరుతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్‌ సుల్తానా మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్య ప్రయివేటీకరణ, ఇతర అంశాలపై చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌, సహాయ కార్యదర్శులు దామెర కిరణ్‌, దాసరి ప్రశాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, అరవింద్‌, సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్‌, నల్లవల్లి రమేష్‌, నాయకులు రజనీకాంత్‌, సతీష్‌, సంతోష్‌, సాక్షి, వాణి, విష్ణువర్థన్‌, రవి పాల్గొన్నారు.
కదం తొక్కిన విద్యార్థి లోకం
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు చేతబూని ఉవ్వెత్తున కదిలారు. ఐబీ నుంచి న్యూ బస్టాండ్‌ మీదుగా కల్వకుంట్ల రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు భాగాన ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు సాను, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూర్తి, నాగరాజు ఇతర నాయకులు నడిచారు. వేలాది మంది విద్యార్థులు అధ్యయనం-పోరాటం వర్థిల్లాలి, సేవ్‌ ఎడ్యుకేషన్‌-సేవ్‌ ఇండియా నినాదాలు చేశారు.