ప్రపంచ సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

Before the Lok Sabha elections Report of the Committee on Jamili– లండన్‌లో ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘భారత్‌, బ్రిటన్‌ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం అత్యవసరం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. శుక్రవారం లండన్‌లోని చారిత్రాత్మకమైన మినిస్టర్‌ ప్యాలెస్‌లో భారతీయ మూలాలున్న బ్రిటన్‌ ఎంపీలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. అందులో లేబర్‌ పార్టీ ఎంపీ వీరేంద్రశర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..”నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి..వీటన్నింటికీ విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం’ అని అన్నారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్‌ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మా గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే విజయం సాధించింది. మీ దేశానికైనా, మా దేశానికైనా గాంధీ ఎంచుకున్న మార్గమే ఇప్పటికీ మార్గదర్శకం’ అని చెప్పారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే ఇంతటి అవకాశం వచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి’ అని బ్రిటన్‌ ఎంపీలతో తన స్వీయ అనుభవాలను పంచుకున్నారు.