– లేదా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
– మంత్రి గంగుల ఎందుకు స్పందించడం లేదు?
– సీపీఐ(ఎం) కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం
నవతెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 19వ డివిజన్ రేకుర్తిలో 194వ సర్వే నెంబర్‌లో జరీనా నగర్, సింహాద్రినగర్‌లోని పేద ముస్లింల ఇండ్లను తిరిగి నిర్మించాలని, లేదా బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండ్లు కూల్చిన ప్రదేశాన్ని బుధవారం సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి, బాధితులతో మాట్లాడారు. అనంతరం గుడికందుల సత్యం మాట్లాడుతూ ఇక్కడి భూములకు డిమాండ్ రావడంతో రియల్ ఎస్టేట్ భూ మాఫియా కన్ను పేదల భూములపై పడిందన్నారు. వారికి రెవెన్యూ యంత్రాంగం వత్తాసు పలుకుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇండ్లను కూల్చడం సిగ్గుచేటని అన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటే జీవో 58, 59 ప్రకారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ మాఫియా అయిన రత్నాకర్‌రెడ్డి వద్ద డబ్బులకు లొంగి సెలవు దినం అయినా అత్యుత్సాహంతో పేదల ఇండ్లను కూల్చి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ వెంటనే స్పందించి, పేదల ఇండ్లను కూల్చివేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధితులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు పున్నం రవి, కొంపల్లి సాగర్, అరవింద్, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీకాంత్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.