– బీఆర్ఎస్ ఆఫీసు నేలమట్టం చేయండి
– మున్సిపల్ కమిషనర్ కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నేను అమెరికా వెళుతున్నా..11వ తేదీ తిరిగి వస్తాను. ఆలోగా నల్లగొండ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేలమట్టం చేయాలని ఆర్అండ్బి శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. శనివారం నల్లగొండ మున్సిపల్ ఆఫీసు సమావేశ మందిరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ నుంచి అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని గతంలో ఎన్నోసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం బాగాలేదని ఆయన మందలించారు. తాను అమెరికా నుండి వచ్చే లోగా కార్యాల యాన్ని కూల్చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా అధికారులు మంత్రి ఆదేశించిన పని వారం రోజుల్లో పని పూర్తి చేసే అవకాశం ఉంది.
మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి…
వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డు రూమ్, రెస్ట్ రూమ్ లకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికి కాలువల అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, మురికి కాలువలు పొంగిపొర్లకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, ఎక్కడా మురికి కాలువలు పూడికతో పూడిపోకుండా పూడిక తీయించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు.అలాగే పట్టణంలో అనాధికారిక నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా ఆక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.