అక్రమ నిర్మాణాలంటూ దళితుల ఇండ్ల కూల్చివేత

Demolition of Dalit houses as illegal structures– ముషీరాబాద్‌లో గుడిసెలను నేలమట్టం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
– అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులు.. అరెస్ట్‌
– బస్తీ వాసుల ఆందోళన
నవతెలంగాణ – ముషీరాబాద్‌
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌ డివిజన్‌ స్వామి వివేకానంద నగర్‌లో పేదల గుడిసెలను అక్రమ నిర్మాణాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. అడ్డుకోబోయిన ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేశారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
స్వామి వివేకానంద నగర్‌లో కొందరు దళితులు దాదాపు 70 ఏండ్లుగా ఇండ్లను నిర్మించుకొని నివాసముంటున్నారు. సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు తమ సిబ్బంది.. పోలీసులతో వచ్చి ఇండ్లను కూల్చివేశారు. స్థానికులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కూల్చివేతల సమయంలో ఆందోళన చేసిన పలువురు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. 70 ఏండ్లుగా నివాసం ఉంటున్న తమ గుడిసెలను తొలగించడంపై కాలనీవాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వడం తప్ప తమ నివాసానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇండ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లో సామాన్లను సైతం తీయకుండానే.. ఒకేసారి ఇండ్లను పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి తమకు నిలువ నీడ లేకుండా చేశారని తెలిపారు. 1990లో శతాబ్ది అపార్ట్‌మెంట్‌ వారు ఇక్కడ నాలా పక్కన స్థలాన్ని తీసుకొని, నాలా స్థలాన్ని కూడా కబ్జా చేసి అపార్ట్‌మెంట్‌ నిర్మించుకున్నారని ఆరోపించారు. దళితులమనే తమను కించపరుస్తూ అపార్ట్‌మెంట్‌ వాసులు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. వారికి విశాలవంతమైన రోడ్ల కోసం తమ ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. 23 కుటుంబాలు జీవిస్తున్న ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నామని, అందరం పనులు కడుతున్నామని తెలిపారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ వస్తుందని తెలుసుకొని ముందుగానే ఇండ్లను పూర్తిస్థాయిలో నేలమట్టం చేశారని వాపోయారు. ప్రభుత్వ అధికారులు కూడా శతాబ్ది అపార్ట్‌మెంట్‌ వారి మాటలు విని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వివేకానంద నగర్‌ కాలనీ వాసులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లులు కేటాయించే వరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని బస్తీ వాసులు అన్నారు.