– డీడీఏ అవినీతికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనం
– బాధిత కుటుంబానికి బృందాకరత్ పరామర్శ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) కూల్చివేసిన ‘ర్యాట్ హోల్ మైనర్ల బృందం నాయకుడు వకీల్ హసన్‌ను కలుసుకుని ఆయనకు, ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపింది. డీడీఏ చర్యను బృందాకరత్ తీవ్రంగా ఖండించారు. కచ్చా కాలనీలో వేలాది ఇండ్లు ఉన్నాయి, అయితే ఉత్తరాఖండ్‌లో 41 మంది మైనర్లను రక్షించడంలో వీరోచిత పాత్ర పోషించిన వకీల్ హసన్ ఇంటిని మాత్రమే కూల్చివేశారు. ఈ చర్య డీడీఏ నిర్లక్ష్యానికి, అవినీతికి ఒక తిరుగులేని నిదర్శనం. డీడీఏ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ దీనికి చైర్మెన్. అందరి అభివృద్ధి గురించి మోడీ ప్రభుత్వం చెప్పే మాటలు ఎంత బూటకమో ఈ ఉదంతం తెలియజేస్తోంది. బీజేపీ రాజకీయాలు, విధానాలు పేదలకు, దళితులకు, మైనారిటీలకు వ్యతిరేకం. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడానికి బదులు వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంలో మోడీ ప్రభు త్వం ఎక్కువ ఆనందం పొందుతున్నట్టుంది” అని ఆమె విమర్శించారు. ”కూల్చివేసిన చోటే వకీల్ హసన్‌కు ఇల్లు తిరిగి నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నిర్మాణం పూర్తయ్యేవరకు ఆయన బస చేసేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని కోరింది. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా లక్షలాది మంది పేదలను తొలగించే చర్యలను డీడీఏ తక్షణమే విడనాడాలని కోరింది. వకీల్ హసన్‌కు, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు వారికి అండగా ఉంటామని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. హసన్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కింద కొంత మొత్తాన్ని ఈ బృందం ఇచ్చింది. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందంలో పార్టీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, కార్యదర్శి వర్గ సభ్యురాలు, ఐద్వా ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఆశా శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు పుష్పేంద్ర తదితరులు ఉన్నారు.
హసన్ నివాసం కూల్చివేతపై సర్వత్రా ఆగ్రహం
ఉత్తరాఖండ్‌లోని సిల్క్వారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించిన ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ నివాసాన్ని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కూల్చివేయడంపౖౖె సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ర్యాట్ హోల్ మైనర్లతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హసన్ మూడు నెలల క్రితం జాతీయ హీరోగా నిలిచాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ఆ ఆనాడు అభినందనలతో ముంచెత్తారు.
ఫిబ్రవరి 28న వకీల్ హసన్, ఆయన భార్య షబానా ఇంట్లో లేని సమయంలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు వారి ఇంటిని కూల్చివేశారు. తమ తల్లిదండ్రులు ఇంట్లో లేరని చెప్పినప్పటికీ వినకుండా అసభ్యంగా మాట్లాడారని వకీల్ కుమార్తె అలీజా కంటతడిపెట్టారు.. తన సోదరుడిని, తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన బంధువును కొట్టారని ఆమె ఫిర్యాదు చేశారు.
”చట్టబద్ధంగా ఉన్న ఇంటిని డీడీఏ బుల్డోజర్‌తో కూల్చేసింది. వృద్ధుడైన తండ్రి, ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబంతో నేను ఇప్పుడు ఎక్కడికెళ్లాలి. చనిపోవడం మినహా మరో దారి కనపడడం లేదు,. మేము సిల్క్యారా టన్నెల్‌లో 41 మందిని రక్షించాము. అందుకు ఇదా ప్రతిఫలం అని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంటిని ఎందుకు కూలగొట్టారో కారణం అడిగినా చెప్పలేదు. అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెెళ్లి రాత్రి ఎనిమిది గంటల దాకా ఉంచారు. నా కుమార్తెను, భార్యను అక్కడే ఉంచారు. నా కొడుకును కొట్టారని హసన్ చెప్పారు. 2012లో 33 లక్షలకు ఇల్లు కొన్నానని, దానిపై ఇంకా రూ.12 లక్షల అప్పు ఉందని అన్నారు. ఇంటిని కూల్చివేసి కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.