– అన్ని అనుమతులిచ్చింది అధికారులే
– బాధితులకు అన్యాయం చేయొద్దు : ఎంపీ ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పిర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని సాయి ప్రియ ఎన్‌క్లేవ్‌లో పేదలు కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేయించడం సరికాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురంలో 350 ఎకరాల్లో సాలార్‌జంగ్ కంచె పేరుతో ఉందనీ, ఆ భూ యజమానుల నుంచి 30, 40 ఏండ్ల కిందట పైసాపైసా కూడబెట్టుకుని, తమకు వచ్చే నెలసరి జీతంలో నెలకింత కట్టుకుంటూ పేదలు అక్కడ ఇండ్ల జాగాలు కొనుక్కున్నారని చెప్పారు. ఇండ్లు కట్టుకునేందుకు అన్ని అనుమతులిచ్చింది ప్రభుత్వ అధికారులే కదా? ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చడమేంటి? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత ప్రభుత్వంలాగానే రేవంత్‌రెడ్డి సర్కారూ పేదలను ఇబ్బందులను గురిచేస్తున్నదని విమర్శించారు. అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి జీహెచ్‌ఎంసీ పర్మిషన్ కూడా ఉందని చెప్పారు. అన్ని అనుమతులున్న ఇండ్లను కూల్చడానికి కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వోకు తెలివి లేదని విమర్శించారు. కలెక్టర్‌కు ఫోన్ చేస్తే ఎత్తట్లేదనీ, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రికి ఫోన్లు చేస్తే తమకు తెలియదని చెబుతున్నారని చెప్పారు. ఈ విషయం సీఎంకు తెలుసా? మున్సిపల్ శాఖ మంత్రికి తెలుసా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించారు. గంజాయి, గుడుంబా అమ్మేవాళ్లను పట్టుకునే సోయి లేదుగానీ పేదల మీద ప్రతాపం ఏంటని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే కసితో కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లేస్తే చేసే పని ఇదా? అని నిలదీశారు. ప్రజలు కొనుక్కున్న భూములకు 118 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ చేయకుండా ఇప్పుడు ఇష్యూ చేయడమేంటి? అని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే అయ్యప్ప సొసైటీ వాళ్లను బెదిరింపులకు గురిచేసిందనీ, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా సాయి ఎన్‌క్లేవ్‌లో అందిన కాడికి దోచుకోవాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. అధికారులు బాధ్యతలు మరిచి వ్యవహరిస్తే జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. పేదల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.