ఢిల్లీలో ప్రియాంక క్యాంప్‌ కూల్చివేత

– బుల్‌డోజర్లతో నేలమట్టం
– రోడ్డున పడ్డ వందలాది పేదలు
న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని వసంత విహార్‌ సమీపంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరిట ఉన్న క్యాంప్‌ను జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బుల్‌డోజర్ల తో కూల్చివేసింది. దీంతో ఈ క్యాంప్‌లో నివాసం ఉంటున్న 97 కుటుంబాలు, వాటికి చెందిన 500 మంది ప్రజలు రోడ్డున పడ్డారు. క్యాంప్‌ ఉన్న స్థలం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందినదని పేర్కొంటూ గత నెల 19న హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానికులకు నోటీసులు ఇచ్చింది. దానిని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నోటీసులకు అనుగుణంగా ఢిల్లీ పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ, స్పందన కేంద్రం (ఎన్‌డీఎంఆర్‌సీ), కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి.
తమ నివాసాలను కూల్చివేయడంపై స్థానికు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలు, జన్‌ధన్‌ యోజన పథకానికి సంబంధించిన జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ నెంబర్లు వంటి అధికారిక పత్రాలు ఉన్నాయని వారు తెలిపారు. విద్యుత్‌ బిల్లులు కూడా తమ పేరిటే ఉన్నాయని చెప్పారు. కూల్చివేతలు ప్రారంభించి, ప్రజలను అదుపు చేసే క్రమంలో కార్మిక సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీసులతో ఘర్షణకు దిగారు.
ఘరేలు కామ్‌కాజీ మహిళా సంఘటన్‌ (జీకేఎంఎస్‌) అధ్యక్షురాలు నేహా బోరా, ఆల్‌ ఇండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఎఐసీసీటీయూ) నాయకుడు ఆకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సామానులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడుతుంటే పలువురు స్థానికులు రోదించారు. చాలీచాలని ఆదాయంతో రెండు గదుల ఇల్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు దానిని కూల్చేశారని, ఇక తమకు దిక్కెవరని సునీత అనే మహిళ వాపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు సంవత్సరాల కాలంలో పేదలు నివసిస్తున్న అనేక కాలనీలను కూల్చివేయడంతో వేలాది మంది ప్రజలు గూడును కోల్పోయి నిరాశ్రయులయ్యారు. లాండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వాచ్‌ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇలాంటి కూల్చివేతల కారణంగా 26 వేల మంది రోడ్డున పడ్డారు.
అధికార అమ్‌ఆద్మీ పార్టీ ఉదాశీనత కారణంగానే తమకు ఈ దుస్థితి దాపురించిందని జీకేఎంఎస్‌కు చెందిన రేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూల్చివేతలకు వ్యతిరేకమంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇప్పుడు ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిం చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమీలా తోకస్‌ కూడా తమ గోడు వినిపించుకోవడం లేదని చెప్పారు. కూల్చి వేతలతో నిరాశ్రయులైన వారి కోసం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు నివాసయోగ్యం కావని, ముఖ్యంగా అక్కడ మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని బీనా అనే కార్మికురాలు తెలిపారు.