అక్రమం పేరిట నిర్మాణాల కూల్చివేత

In the name of illegality Demolition of structures– లబోదిబోమంటున్న బాధితులు
– తాము మోసపోయాం..
– ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికెళ్లాలని ఆవేదన
– సుమారు 200కి పైగా నిర్మాణాలు నేలమట్టం
– కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు : ఆర్డీవో
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండల గాజుల రామారం డివిజన్‌ పరిధిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ ఉన్నతాధికారులు శనివారం కూల్చేశారు. కబ్జాదారుల చేతుల్లో మోసపోయి.. కష్టార్జితంతో కొన్న పేదలు లబోదిబోమంటున్నారు. ఇండ్లను కూల్చేస్తే తమకు చావే దిక్కని బాధితులు జేసీబీలకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. కిరోసిన్‌ పోసుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి..
కుత్బుల్లాపూర్‌ మండలం కైసర్‌ నగర్‌, దేవేందర్‌ నగర్‌ ప్రాంతాల్లో రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 307, 342, 329, 307 (ఎస్‌.ఎఫ్‌.సి)లో వందల ఇండ్లు ఉన్నాయి. అవి అక్రమ కట్టడాలంటూ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో జగద్గిరిగుట్ట పోలీసులు, సీఆర్పీఎఫ్‌ పోలీసుల బందోబస్తు మధ్యన కూల్చివేతలకు అధికారులు రంగం సిద్దం చేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్‌ జిల్లా ఆర్డీఓ శ్యామ్‌ప్రకాశ్‌ గుప్తా మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా కుత్బుల్లాపూర్‌ మండల పరిధిలోని గాజులరామారం శివారు ప్రాంతాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో.. పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసుల బందోబస్తు నడుమ సుమారు 200 నిర్మాణాలను కూల్చేశామని, మిగతా వాటిని కూడా పూర్తిగా రెండు మూడ్రోజుల్లో కూల్చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న గదులు నిర్మించి పేదలకు విక్రయిస్తున్న కబ్జాదారులపై కేసులు పెదుతున్నామని, పీడీ యాక్ట్‌లు నమోదు చేయాలని పోలీసులకు చెప్పామన్నారు. ఇలాంటి అక్రమ కట్టడాల మధ్య కరెంట్‌ మీటర్లు, స్తంభాలు మంజూరు చేసిన విద్యుత్‌ అధికారులను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా, ఎవరూ స్పందించట్లేదని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ భూములను గుర్తించి కంచె ఏర్పాటు చేస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ రెహమాన్‌, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
బాధితుల గగ్గోలు
గాజులరామారంలో ప్రభుత్వ స్థలంలో కొందరు గదులు నిర్మించి పేదలకు అమ్మినట్టు తెలుస్తోంది. వాటిని అధికారులు కూల్చేయడంతో కొన్న పేదలు లబోదిబోమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి రావడంతో నిర్మాణదారులు రోదించారు. తమకు చావే దిక్కు అంటూ కొంతమంది పేదలు గుండెలు బాదుకున్నారు. అప్పు సప్పు చేసి బంగారం, నగలు అమ్మి రూ. లక్షలు పోసి స్థలాలను కొన్నామని, తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ ముందు ఆందోళన చేస్తున్న క్రమంలో అధికారులకు, బాధితులకు వాగ్వివాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు తమ ఇండ్ల కూల్చేస్తే చచ్చిపోతామంటూ కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పేద ప్రజలను మోసం చేస్తున్న భూకబ్జాదారులపై ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసులు నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అప్పు చేసి కొన్నాం : బాధితుడు చంద్రయ్య
పుస్తెలతాడుతోపాటు అప్పు చేసి స్థలాన్ని కొన్నాం. ఇప్పుడు ఇలా కూల్చివేయడంతో తమలాంటి గరీబోడిని ఆదుకునేది ఎవరు..? సీఎం రేవంత్‌ రెడ్డి తమలాంటి పేదలను ఆదుకోవాలని, లేకపోతే తమకు చావే దిక్కు అని చంద్రయ్య వాపోయాడు.
ఇప్పుడైనా ప్రభుత్వ భూములను కాపాడండి సీపీఐ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్‌
గాజులరామరం డివిజన్‌ పరిధిలో అధికారులు అక్రమ నిర్మాణాలను భారీగా కూల్చివేశారని.. కానీ మొత్తంగా తొలగించలేదని సీపీఐ కుత్బుల్లాపూర్‌ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్‌ అన్నారు. గతంలో కూడా భారీ కూల్చివేతలు చేసి వదిలేస్తే మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయని, భూమిని పరిరక్షించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా పేదలు నష్టపోతున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుంచి పోరాడుతుంటే అప్పుడే పట్టించుకుంటే ఇంత మంది పేదలు కబ్జాదారుల చేతిలో మోసపోయే వాళ్ళు కాదన్నారు. ఆ స్థలంలో ఇప్పటికైనా ప్రభుత్వ భూమి అని చెప్పే కంచెలు వేయ్యాలని కోరారు. ఈ కూల్చివేతలు తాత్కాలికం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని, మరోసారి కబ్జాలు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.