బెంగళూరులో డెంగ్యూ విజృంభణ

– హైఅలర్ట్‌ ప్రకటించిన నగర పాలక సంస్థ
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్‌ ప్రకటించినట్లు బహత్‌ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్‌ వికాస్‌ కిషోర్‌ వెల్లడించారు. డెంగ్యూ వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. మే 1వ తేదీ నుంచి మే 13వ తేదీ మధ్య డెంగ్యూ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని చెప్పారు. ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ వల్ల డెంగ్యూ వైరస్‌ వ్యాపించిందన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నగర ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బెంగళూరు మహానగరంలోనే కాకుండా కర్ణాటక అంతటా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 2,877 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 1,725 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.