ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: డిఈఓ

నవతెలంగాణ -దామరచర్ల
అభ్యసన అభివృద్ధి కార్యక్రమ అమలులో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి హెచ్చరించారు. దామరచర్ల లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, వీర్లపాలెం ప్రాథమిక పాఠశాల లను మంగళవారం ఆకస్మికముగా తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కేజీబీవీ బాలికలు గత నెల రోజులుగా అభ్యసన వాతావరణ నికి దూరంగా ఉన్నారని అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయినులు పాఠ్యప్రణాళిక, వార్షిక ప్రణాళిక, బోధనోపకరణముల ఆధారంగా తరగతి గదిలో అభ్యసన ప్రక్రియలు రూపొందించి పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పటికే సిలబస్ పూర్తి అయినందున పునరాభ్యాసనం చేయించి విషయాల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మెనూ ప్రకారం భోజనాలు పెట్టించాలని ఆహార పదార్థాలు తాజాగా వేడివేడిగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాల వీర్లపాలెం ఉపాధ్యాయుల పాఠ్యప్రణాళిక డైరీలను పరిశీలించి రాయని వారిని మందలించారు. ఒకే ప్రాంగణంలో ఉన్న రెండు ప్రాథమిక పాఠశాలను కలిపి నడపాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, ప్రత్యేక అధికారిని అరుణ, ప్రధానోపాధ్యాయులు పుష్పలత ఏ శంకర్, పంతులు తదితరులు ఉన్నారు..