సౌత్‌ గెలుపుపై నీళ్లు నార్త్‌జోన్‌తో దేవధర్‌ ట్రోఫీ

పాండిచేరి: 48వ దేవధర్‌ ట్రోఫీ లిస్ట్‌-ఏ వన్డే టోర్నమెంట్‌లో సౌత్‌-నార్త్‌జోన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ రద్దు కాగా.. ఇతర మ్యాచుల్లో నార్త్‌, ఈస్ట్‌జోన్‌ జట్లు విజయం సాధించాయి. క్యాప్‌ సేహం గ్రౌండ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 303పరుగులు చేసింది. ఓపెనర్లు రోహన్‌(70), కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(64)కి తోడు నారయణ్‌ జగదీశన్‌(72) అర్ధసెంచరీలతో రాణించారు. రికీ బురు(31), అరుణ్‌ కార్తీక్‌(21) ఫర్వాలేదనిపించారు. నార్త్‌జోన్‌ బౌలర్లు మార్కండే, రిషీ ధావన్‌కు రెండేసి, సందీప్‌, యాదవ్‌, నితీశ్‌ రాణా, ధగర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్‌జోన్‌ జట్టు 19ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 55పరుగులు చేసిన అనంతరం భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయింది.
దీంతో మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి ఇరుజట్లకు చెరోపాయింట్‌ కేటాయించారు. క్యాప్‌ గ్రౌండ్‌-2లో జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్‌ జట్టు 9వికెట్ల తేడాతో నార్త్‌-ఈస్ట్‌-జోన్‌ జట్టుపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌-ఈస్ట్‌-జోన్‌ జట్టు 47ఓవర్లలో 207పరుగులకు కుప్పకూలింది. ఇమిపతి(38), కిషాంగ్బామ్‌(30) టాప్‌స్కోరర్స్‌. నగ్వాస్వల్లాకు మూడు, శివమ్‌ దూబే, ములానీకి రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని వెస్ట్‌జోన్‌ జట్టు 25.1ఓవర్లలో హర్వాక్‌ దేశారు(85)వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ప్రియాంక్‌ పంచల్‌(99నాటౌట్‌) సెంచరీకి చేరువలో ఉండగా మ్యాచ్‌ ముగిసింది.క్యాప్‌-3లో జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ జట్టు 6వికెట్ల తేడాతో సెంట్రల్‌జోన్‌పై గెలిచింది. సెంట్రల్‌ జోన్‌ జట్టు 50ఓవర్లలో 207పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఈస్ట్‌జోన్‌ జట్టు 46.1ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 208పరుగులు చేసి గెలిచింది. బుధవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లలో నార్త్‌ జోన్‌ జట్టు సెంట్రల్‌జోన్‌తో, వెస్ట్‌జోన్‌ జట్టు సౌత్‌జోన్‌తో, ఈస్ట్‌జోన్‌ జట్టు నార్త్‌-ఈస్ట్‌-జోన్‌ జట్లతో తలపడనున్నాయి.