– రాఘవాచారి స్మారకోపన్యాసంలో సీనియర్ పాత్రికేయులు పరంజయ్ గుహ ఠాకుర్తా
అమరావతి : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని సీనియర్ పాత్రికేయులు పరాంజయ్ గుహ ఠాకుర్తా అన్నారు. రాఘవాచారి నాల్గవ వర్ధంతి కార్యక్రమం విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. రాఘవాచారి ట్రస్ట్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ అనే అంశంపై పరాంజయ్ స్మారకోపన్యాసం చేశారు. పెట్టుబడిదారీ విధానంలో ఆస్తి వ్యక్తిగతంగా ఉండటంతోపాటు పెట్టుబడిదారుల మధ్య పోటీ లక్ష్యంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడిలో పోటీ ఉండదని తెలిపారు. స్కాట్‌లాండ్, వియత్నాం, క్యూబా వంటి దేశాల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దేశంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటుచేశారని తెలిపారు. 40 శాతం నౌకాశ్రయాలు గౌతమ్ అదానీ చేతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారులు ఎదగటానికి రాజకీయ అంశాలు కారణమవుతాయని తెలిపారు. జివికె సంస్థపై ఇడితో దాడులు చేయించి ముంబయి ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించారని విమర్శించారు. రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులను కూడా అదానీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, ఉద్యమకారులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. నిజాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా విస్తరించినా అందులో అవాస్తవాలు ఎక్కువగా ప్రచారమవుతున్నాయని చెప్పారు. వాస్తవాల్ని స్వేచ్ఛగా రాసే జర్నలిస్టులు రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యూస్‌క్లిక్ ఛానల్‌పై దాడిచేయటం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌వి రామారావు మాట్లాడుతూ గోడీ మీడియా పెరగడంతో ప్రధాన స్రవంతి మీడియా ప్రాధాన్యం తగ్గిందని చెప్పారు.