అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ మళ్లీ దిగజారుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి, అంటే రూ.84.10కి దిగజారింది.భారతీయ కరెన్సీ రూపాయి 2022 లో దారుణంగా పతనమైంది. ఆసియాలోనే అత్యంత ఎక్కువగా పతనమైన కరెన్సీగా అప్పుడు రికార్డుల్లో నిలిచింది. 2024 లో అంతకంటే పతనమై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక మన దేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్థనే పాలక వర్గాలు పాదు కొల్పాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి ఆశించినంత పెరగలేదు.అమెరికా డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీకి ప్రామాణికంగా తీసుకోవడానికి అంటే, 1966కి ముందు భారత రూపాయి విలువను బ్రిటిష్ పౌండ్‌తో పోల్చి చూసేవారు. 1949లో పౌండ్ విలువ పతనమైంది. దీంతో రూపాయి విలువ దాంతో దాదాపు సమానంగా ఉండేది. 1966లో తొలిసారి భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే పతనమైంది. ఆ కాలంలో భారత్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే దీనికి కారణం. రుతుపవనాలు ముఖం చాటేయడంతోపాటు కరవు ఏర్పడి పంటల దిగుబడి తగ్గింది, పారిశ్రామిక ఉత్పత్తి కూడా మందగించింది. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరలు భారీగా పెరిగాయి.చైనా, పాకిస్థాన్‌లతో భారత్ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దీనికి కరవు తోడవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. స్థూల ఆర్థిక సూచీకలు బలహీనపడటంతో రూపాయి విలువ పడిపోయింది. 1996, జూన్ 6న ఇందిరాగాంధీ ప్రభుత్వం డాలర్‌తో రూపాయి మారకం రేటును ఒకేసారి రూ.4.76 నుంచి రూ.7.50కి తగ్గించింది.
1991లో భారత్‌కు ఫిక్స్‌డ్ ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్ ఉండేది. ఆ సమయంలో భారత రూపాయి విలువ మన దేశంతో వాణిజ్యం జరిపే దేశాలతో పోలిస్తే దాదాపు ఒకే విలువను కలిగి ఉండేది. 1991 చివరి నాటికి భారత్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో చెల్లింపులు కూడా కష్టమయ్యాయి. 1966 నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరగడం, బడ్జెట్ లోటు అంతరాలు, చెల్లింపులు జరపలేని స్థితిలోకి భారత ఆర్థిక వ్యవస్థ దిగజారింది. దీంతో పీవీ నర్సింహారావు ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దడం కోసం ఆర్థిక సంస్కరణలకు తెరతీసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సార్లు రూపాయి విలువను భారీగా తగ్గించింది. 1991 జులై 1న 9 శాతం, రెండు రోజుల అనంతరం 11 శాతం చొప్పున రూపాయి విలువను తగ్గించింది. దీంతో ఆ ఏడాది జూన్ 30న రూపాయితో పోలిస్తే 21.14గా ఉన్న డాలర్ విలువ మరుసటి రోజుకు రూ.23.04కు చేరింది. జులై 3న ఆర్బీఐ మరోసారి రూపాయి విలువ తగ్గించడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక రేటు రూ.25.95కి పడిపోయింది. మూడు రోజుల వ్యవధిలోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 18.5 శాతం, పౌండ్‌తో పోలిస్తే 17 శాతం పతనమైంది.1991 నుంచి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఏటా 3.74 శాతం చొప్పున (3.74 సీఏజీఆర్) పతనమైంది.
2000-2007 మధ్య ఒక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.44-48 మధ్య దాదాపు నిలకడగా ఉంది. 2007 చివర్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 రూపాయలకు చేరుకుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడుల నిలకడగా రావడమే దీనికి కారణం. కానీ 2008 ఆర్థిక మాంద్యం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టిన పెట్టుబడులను తమ దేశాలకు మళ్లించుకోవడంతో రూపాయి విలువ పతనమైంది. 2009 తర్వాత డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పతనమై రూ.46.5 నుంచి రూ.79.5కి పడిపోయింది. 2013 ఆరంభంలో రూపాయి విలువ 27శాతం పతనమైంది.పెద్దనోట్ల రద్దు, అసంబద్ధంగా జీఎస్టీ అమలు, కరోనా సంక్షోభం కారణంగా గత కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. రూపాయి విలువ క్రమేపీ పడిపోతూనే ఉంది.
రూపాయి పడిపోయేందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్ప వచ్చు. అయితే అందులో ప్రధానంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇతర దేశాల మార్కెట్లలోకి తరలించడం వంటివి మన దేశ కరెన్సీ రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతు న్నాయని చెప్పొచ్చు. దీంతో నేడు జీవన కాల కనిష్ఠ స్థాయి అయిన రూ.84.10ని చేరింది అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కరెన్సీకి ఉండే డిమాండ్, దాని సప్లరుని బట్టి విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.ఒక దేశానికి చెందిన వస్తువులు, సేవలకు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ పెరగడమో, తగ్గడమో జరుగు తుంది.ఆర్థిక వ్యవస్థలో ఇంధన వనరులది కీలక పాత్ర. మనదేశ ఇంధన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ.భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 28శాతం. రూపాయి బలహీనతకు ముడిచమురు ధర చాలా ప్రభావం చూపుతున్నది. మన దేశానికి ఇరాన్‌తో చాలా మంచి సంబంధాలు ఉండటం వల్ల వర్తక వాణిజ్యం, మరీ ముఖ్యంగా చమురు దిగుమతులు ఎక్కువగా ఆ దేశం నుంచి గతంలో చేసుకున్నాం.
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగి గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. అది ఇటీవలే దాదాపు పది శాతానికి పైగా పెరిగింది. దీంతో క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువ మొత్తం చెల్లించి డాలర్లు కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో రూపాయి విలువ పతనమవుతోంది. మరోవైపు అమెరికాలో విడుదలైన సీపీఐ డేటా సైతం రూపాయి విలువ పడిపోయేందుకు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరోమారు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే డిసెంబర్ నెలలో మరో 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించ వచ్చనే అంచనాలున్నాయి. వచ్చే డిసెంబర్‌లో వడ్డీ రేట్ల కోతకు బ్రేకులు పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చిందని, మళ్లీ చైనా మార్కెట్ లు పుంజుకున్నాయనే వార్తలతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తూ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటున్నారు. ఇది కూడా రూపాయి విలువ పతనమయ్యేందుకు కారణమవు తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల రూపాయి విలువ క్షీణిస్తున్నది.2008 ఆర్ధిక సంక్షోభంలో సైతం మన దేశం నుంచి 11.8 బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు బయటికి వెళ్తే,2022 లోనే దాదాపు 30 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు దేశం దాటి వెళ్లాయి.స్థూల విదేశీపెట్టుబడులు 2022-23 లో 85 బిలియన్ డాలర్లు ఉండగా,2023-24 నాటికి 71 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2021-22 తో పోలిస్తే ,నికర విదేశీ పెట్టుబడులు 2023-24 లో 28 బిలియన్ డాలర్లు పైబడి పడిపోవడం గమనార్హం! విదేశీ సంస్థాగత మదుపు దారులు గత ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో 20.5 బిలియన్ డాలర్లు మనదేశంలో పెట్టుబడులు పెట్టగా,ఈ ఏడాది అదేకా లానికి అది కేవలం 6.5 బిలియన్ దాలర్లకు పరిమితం అయ్యింది. పరిమాణంలో రాజస్థాన్ రాష్ట్రంతో పోల్చగలిగే వియత్నాం దేశం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14.15 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించగలిగింది. అమెరికాలో వడ్డీరేట్టు పెంచితే అక్కడే పెట్టుబడులు పెడతారు. మనదేశంలో పెట్టే పెట్టుబడుల పై వడ్డీ కన్నా అమెరికాలో బాండ్ల మార్కెట్ పై ఎక్కువ లాభం వస్తోంది. దీంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. కరోనా విజృంభణ తరవాత ఈజీ మనీ చలామణీ పెరగటం, ప్రపంచంలో మాంద్యం తాలూకు పరిస్థితులు కూడా డాలర్ మెరుగుపడటానికి కూడా ఒక కారణం అయ్యాయి.ఆసియాలో థారు బట్, మలేసియా రింగిట్, దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్స్ పెసో, ఇండోనేషియా రూపయ్యా, చైనా యువాన్ కరెన్సీలు రెండేళ్ళ క్రిందట తీవ్రంగా ప్రభావితమ య్యాయి. వీటన్నిటికంటే ఎక్కువగా భారతీయ రూపాయి దెబ్బతింది.
ఒక దేశ అప్పు గణనీయంగా పెరిగితే, దాని ప్రభావం దేశంలోకి వచ్చే పెట్టుబడులపై పడుతుంది.మన దేశ స్థూల జాతీయోత్పత్తి లో 82శాతం నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ఉండడం గమనార్హం.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.185 లక్షల కోట్లు! ఈ ఏడాది చేస్తున్న కొత్త అప్పులు రూ.14 లక్షల కోట్లు.కడుతున్న వడ్డీలు రూ.11.9 లక్షల కోట్లు. ఇది కూడా విదేశీ పెట్టుబడులు రాకపోవ డానికి ఒక పెద్ద కారణం. ఎగుమతుల కన్నా దిగు మతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్యలోటు ఏర్పడుతుంది. వాణిజ్యలోటు పెరిగినంత కాలం రూపాయి పతనమవుతూనే ఉంటుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఆగస్ట్, 24 నాటికి 29,733 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడి మరింతగా రూపాయి పతనానికి దారితీసింది. రాబోయే రోజుల్లో ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు వెంటాడే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనా. ప్రపంచ వృద్ధిరేటు మందగిస్తున్న నేపథ్యంలో 2024-25లో ఎగుమతుల్లో జోరు నెలకొంటుందా? అనేది సందేహాస్పదమే.ప్రపంచంలో అనేక దేశాలు మాంద్యంకు గురికావడం ,పశ్చిమాసియా తో బాటు ప్రపంచమంతా యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో వాణిజ్యలోటు మరింత పెరిగి రూపాయి ఇంకా పతనం కావచ్చు.
మన దేశ ఆర్ధికమంత్రి మాత్రం ఇది రూపాయి పడిపోవడం కాదు, డాలర్ బలపడటమే అంటారు. మరి, రూపాయి విలువ పతనానికి దారితీసే ఆర్ధిక పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉందా, లేదా? డాలర్‌తో పోల్చినప్పుడు మన దేశంతోపాటు ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనపడ్డాయని మన ప్రభుత్వం వాదిస్తోంది.అయితే, సామాజిక భద్రత కనిష్టంగా ఉన్న మన దేశంలో రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల సమాజంలో దాదాపు అన్ని వర్గాలమీద విపరీతమైన ప్రభావం పడుతుంది.మన అవసరాల్లో దాదాపు సగం దిగు మతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి ఆ మేరకు పన్నులన్నీ కలపడం వల్ల సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారం చూపుతుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దానికి సంబంధించిన అన్ని రకాల సేవలపై దీని ప్రభావం ఉంటుంది. ప్రయాణ చార్జీలు, కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ప్రజల జీవన వ్యయం పెరగడం వల్ల ఆదాయపు విలువ తగ్గి ప్రజలకు తీవ్ర భారంగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వాలు, ఆర్‌బీఐ కలిసి కొన్ని కర్తవ్యాలతో ముందుకు సాగాల్సిన అవసరమున్నది. మన ఎగుమతులను, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంది. దేశంలో నిరుద్యోగం నిరుద్యోగం తాండవిస్తోంది. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి.దేశానికి ఉపయోగపడే రంగాలలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షిం చాలి.ఎగుమతిదారులకు పన్ను రాయితీలివ్వాలి. ఎగుమతి రుణాలు సులభంగా లభ్యమయ్యేలా చూడాలి. టెక్స్‌టైల్స్, తోలు వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్ ఎగుమతులు ఇటీవల తగ్గాయి. దీన్ని పరి గణించి మళ్లీ ఎగుమతులు పెంచాలి. రూపాయి విలువ పతనం వలన మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే, ప్రభుత్వానికి అదనపు నిధులు,డీవిడేండ్లు సమకూరుతాయి.వాటిని ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో వినియోగిస్తే ,మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. మౌలిక వసతుల కల్పన జరిగి, శాంతి భద్రతలు మెరుగుపడితే ,పొరుగు దేశాలతో శాంతి నెలకొల్పితే దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచవచ్చు.దాంతో దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున సమకూరుతుంది. కనుక, సరైన చర్యలు చేపట్టి ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలు రూపాయి పతనాన్ని నిరోధించాలి.
పి.సతీష్
9441797900