జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికందాకా రెండు త్రైమాసికాలలో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదింపుకు గురైందని బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటాను బట్టి తెలుస్తోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగావున్న జపాన్ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) మూడవ త్రైమాసికంలో 2.1శాతం కుదింపుకు గురైంది. ఇది వార్షికంగా పడిపోతుందనుకున్న 0.6శాతం కంటే చాలా ఎక్కువ. రెండవ త్రైమాసికంలో 4.5శాతం పెరిగిన తరువాత ఈ పతనం జరిగింది. జపాన్ లో అభివృద్ధి మందగించిందని, ప్రస్తుత త్రైమాసికంలో కూడా జపాన్ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గరైతే ఆశ్చర్యపోవలసిన అవసరంలేదని నొరించుకిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ ఎకనామిస్టుగావున్న తకేషి మినామి అన్నారు.
కుటుంబాల వినిమయాన్ని కుదించే అతి ద్రవ్యోల్బణం, చైనా, ఇతర ప్రాంతాల నుంచి బలహీనమైన బాహ్య డిమాండ్ వల్ల జపాన్ పారిశ్రామికవేత్తలు వత్తిడికి గురైన కారణంగా జపాన్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొంటున్నది. అధికారికంగా విడుదలైన డేటా ప్రకారం అంతకు ముందు త్రైమాసికంలో 0.9శాతం కుదింపుకు గురైనప్పటికీ జులై-సెప్టెంబర్ మధ్యకాలంలో వినిమయంలో మార్పురాలేదు. ఆర్థికవేత్తలు 0.2శాతం వృద్ధి ఉంటుందని ఆశించినా జపాన్ ఆర్థిక వ్యవస్థ ఇలా కుదింపునకు గురవటం విశేషం. వినిమయదారుల కొనుగోలు శక్తికి సూచికగా భావించబడే ద్రవ్యోల్బణంతో సర్దుబాటుచేసిన నిజ వేతనాలు సెప్టెంబర్ లో 2.4శాతం పతనం అయ్యాయి. ఇలా జరగటం వరుసగా 18వసారి.