నవతెలంగాణ-వైరా
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజి ఆస్పత్రిలో మంగళవారం ఉదయం మృతిచెందారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఎస్‌సి సామాజిక తరగతికి చెందిన మల్లు అఖిలాండ దాస్, మాణిక్యమ్మ దంపతుల మూడో సంతానం అయిన వెంకటేశ్వర్లు హోమియోలో ఎమ్‌డి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆచార్యులుగా, ఆ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన ఆయన ఒకటో వార్డులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ప్రయివేటుగా వైద్య వృత్తిని కొనసాగించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. మల్లు వెంకటేశ్వర్లు మరణంతో వారి కుటుంబంలోనూ, లక్ష్మీపురంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.