దేవాలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు: డిప్యూటీ కలెక్టర్ అనిత

– దేవాలయ భూముల పరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత
– కడ్తాల్ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయ భూముల సర్వే, హద్దుల ఏర్పాటు 
నవతెలంగాణ – ఆమనగల్
దేవాలయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దేవాలయ భూముల పరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు. మంగళవారం ఆమె  స్థానిక నాయకులతో పాటు సంబందిత అధికారులతో కలిసి కడ్తాల్ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ భూములకు సంబంధించి సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా సర్వే నెంబర్ 130, 125 లలో ఆలయ భూమికి సంబంధించిన కొలతలు చేపట్టి హద్దులు ఏర్పాటు చేశారు. పై భూమిలో ప్రవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న రోడ్డును తొలగించారు. అదేవిధంగా సర్వే నెంబర్ 120లో ఉన్న ఆలయ భూమికి కొలతలు చేపట్టి హద్దులు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. సర్వే చేసిన ఆలయ భూమిలో పూర్తి వివరాలు పొందుపరిచిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా  డిప్యూటీ కలెక్టర్ అనిత మాట్లాడుతూ ఇక ముందు ఆలయ భూములకు సంబంధించి హద్దులు, హెచ్చరిక బోర్డులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో దేవాదాయశాఖ తహసీల్దార్లు హరిత, విజయలక్ష్మి, ఈఓలు మోహన్ రావు, స్నేహలత, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మెన్ ఆంజనేయులు, డైరెక్టర్ చేగూరి వెంకటేష్, నాయకులు గూడూరు శాయి రెడ్డి, మాలె మల్లేష్ గౌడ్, భీక్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.