నవతెలంగాణ-ఓయూ
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగ అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డితో కలిసి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వారు బయలుదేరి ముందుగా గన్ ఫౌండ్రీలో ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర నివాళ్లర్పించారు. అనంతరం గాంధీ భవన్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ అంబర్‌పేట్ అభ్యర్థి రోహిన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్‌మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్, టీటీయూసీ శివకుమార్, టీటీయూసీ పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ కార్పొరేటర్లు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.