మానవుని జీవనశైలి
నలుగురి మేలుకై
మంచి మలుపు తిరిగింది.
ఆ మలుపే ‘సాంకేతికతై’
సృష్టికి ప్రతిసృష్టి చేసే
‘అపర విశ్వకర్మల’ రూపంలో
ప్రవహించే నీటిని కట్టడి చేసి
జలకళకాధారమై
ధాత్రీసతి
పచ్చని దుకూలము ధరించినట్లు
పుడమిని సస్యశ్యామలం చేసి
కనుకొలకులనుండి
దుఃఖాశ్రువులు జారే మనిషి జీవితంలో
బతుకుపై ఆశను కలిగిస్తూ
మళ్లీ కొత్తవసంతం చిగురింపచేసింది.
సమరస జలాలతో
జగత్కల్యాణ భావనా
సుమసుగంధాలతో తొణికిసలాడే
‘సమాజపు సరోవరంలో’ తేలియాడే
తలపుల సౌగంధికంపై
దినకరునిలా దీవించే
ఈ ఆమోఘ ఆవిష్కరణల స్రష్టలు
అవనిపై పుట్టిన అపర బ్రహ్మలు.
ప్రభాత జ్ఞానకిరణాల నొడిసిపట్టుకుని
మెల్లమెల్లగ విచ్చుకునే
సహస్రదళ పద్మంలా భాసించి
విశ్వంనుండి నీరాజనాలందుకుంటూ
ఆశయాల కాంతి పథంలో
అఖండంగా భాసించే
మానవత్వపు దీపాలు,
తమ మేధస్సుతో
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే
నిర్విరామ శ్రామికులైన ఇంజినీర్లు
– వేమూరి శ్రీనివాస్, 9912128967