– భారత అథ్లెట్ల పోటీకి అనుమతి
పారిస్: ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య జోక్యంతో ఫ్రెంచ్ అథ్లెటిక్స్ నిర్వాహకులు దిగి వచ్చారు. ఇటీవల వాడా విడుదల చేసిన 2022 వార్షిక డోపింగ్ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధిక శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డోపింగ్ అంశంలో ఎటువంటి రిస్క్ తీసుకునే ఆలోచనలో లేని ఫ్రెంచ్ అథ్లెటిక్స్.. అంతర్జాతీయ అథ్లెటిక్స్ క్యాలెండర్‌లో భాగమైన ‘ ది మీటింగ్ డె లిమోగస్’ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న ముగ్గురు భారత అథ్లెట్లను పోటీ నుంచి దూరం పెట్టింది. ఫ్రెంచ్ అథ్లెటిక్స్ నిర్వాహకుల నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. ముగ్గురు భారత అథ్లెట్లు పోటీపడవచ్చని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా, వాడా నివేదిక ప్రకారం భారత్‌లో 3865 శాంపిల్స్ (బ్లడ్, యూరీన్)ను పరీక్ష చేశారు. ఇందులో 3.2 శాతం అనగా 125 శాంపిల్స్ పాజిటివ్‌గా తేలాయి. కనీసం 2000 శాంపిల్స్ పరీక్ష చేసిన దేశాల్లో భారత్‌లోనే అత్యధిక పాజిటివ్ రేటు నమోదైంది. ఫ్రెంచ్ అథ్లెటిక్స్ నిర్వాహకులు భారత అథ్లెట్లను పోటీకి నిరాకరించటం, మళ్లీ పోటీకి అనుమతించటం పట్ల భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అదిలె సుమారివాలా స్పందించలేదు.