– మహారాష్ట్రలో సీఎంకు ఘన స్వాగతం
– షోలాపూర్ చేరుకున్న గులాబీ దళపతి
– నేడు పండరీపురానికి …
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మహా రాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్లిన ఆయన వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. 600 వాహనాలతో కూడిన కాన్వారు (దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవు) కేసీఆర్ వెంట ముంబయి రహదారి మీదుగా కొనసాగింది. మహారాష్ట్రలోని ధారాశివ్‌కు చేరుకున్న సీఎంకు స్థానిక నాయకులు, మహిళలు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘దేశ్ కీ నేత కేసీఆర్’ ‘దేశ్ కీ నేత కైసే హో-కేసీఆర్ జై సా హో’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంబంధిత ఫ్లెక్సీలను వారు ప్రదర్శించారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్… అక్కడి నుంచి జోరు వానలో సోలాపూర్‌కు చేరుకున్నారు. అక్కడి బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఆయనకు ఘన స్వాగతం పలికాయి. స్థానిక సీనియర్ నేత, మాజీ ఎంపీ ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వనం మేరకు ఆయన ఇంటికి కేసీఆర్ వెళ్లారు. సమకాలీన రాజకీయ పరిస్థితులపై వారిరువురూ చర్చించారు. ఆ ప్రాంతంలో స్థిరపడిన తెలంగాణ వాసులను సీఎం పలుకరించారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న పద్మశాలీల బాగోగుల గురించి ఆయన వాకబు చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి సోలాపూర్‌లోనే బస చేయనున్నారు. మంగళవారం ఆయన పండరీపురంలోని విట్టల్ రుక్మిణీ దేవస్థానాన్ని సందర్శిస్తారు. అక్కడ పూజాధికాల అనంతరం సర్కోలిలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తుల్జా భవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.