ధ్వంస రచన నశించాలి

Destructive writing must perishపిల్లలంటే రేపటి లోకం. చిరునవ్వులకు, శాంతి సామరస్యాలకు సంకేతం. స్నేహశీలతకు, ప్రేమా స్వచ్ఛతలకు ప్రతిరూపాలుగా చెప్పుకుంటాము. పాలబుగ్గల నవ్వులతో అలరారే వారి మోమును చూడగానే ఎవరికైనా మనస్సు ఆనందమయ మవుతుంది. హాసము చిగురిస్తుంది. ఓ చల్లని దీవెనో.. చెంపలపై తీయని ముద్దో పెట్టక మానరు ఎవరైనా… ‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యశ్లేషార్థాలూ ఏమీ ఎరుగని’ పువ్వుల్లాంటి వాళ్లను చూస్తూ చూస్తూ ఎలా చిదిమేయబుద్ధి అవుతోంది వాళ్లకు? అన్నన్ని బాంబులను, మిస్సయిల్లను విచక్షణారహితంగా, ఆ ముక్కుపచ్చలారని పిల్లలపైన విసిరి రక్తపుటేరులు పారించడం, విధ్వంస మొందించడం ఎంత దారుణమైన విషయం! యుద్ధానికీ ఓ నీతి ఉంటుంది. సాధారణ ప్రజలు జీవిస్తున్న ప్రాంతాలలో బాంబులు వేయడం, సామూహిక హత్యాకాండకు పూనుకోవడం కిరాతక కృత్యంకాక మరేమి!
అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న భీకరదాడికి రక్తనదులు పారుతున్నాయి. సంవత్సర కాలంగా చేస్తున్న ఈ దాడి పాలస్తీనాను దాటి లెబనాన్‌, బాలాV్‌ా, నుస్రత్‌ శరణార్థ శిబిరం, ఆజ్‌ బవైదా ఏరియాల్లో ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపించడంతో యాభైఐదు మంది మరణించగా అందులో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారని తెలుస్తున్నది. మొదటి దాడి నుండి బతికి బయటపడి తప్పించుకుని వెళుతున్న వారిపై మళ్లీ దాడిచేసి మట్టుబెట్టడం, ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని తెలియజేస్తుంది. గత సంవత్సరకాలంగా ఎంతో మంది పిల్లలు రక్తపు మడుగుల్లో పడి, కూలిన శిథిలాలలో మౌనంగా, అచేతనంగా పడివున్న పసిపిల్లల మృత్యు దృశ్యాలను చూసి దుఃఖించని మానవ హృదయం ఉంటుందా! మన కండ్లముందే దారుణాలు జరిగి పోతున్నాయి. చేతుల్లో కన్నబిడ్డల శవాలను ఎత్తుకుని విలపిస్తున్న తల్లిదండ్రుల దుఃఖపు కేకలు, ఈ ప్రపంచాన ఎవ్వరివైనా ఒకటే కదా! ఆ రోదనను ఓదార్చే తాహతు ఎవరికుంది! ఎవరు తీర్చగలరు వాళ్ల బాధని. విధ్వం సాలలో కూడా విరిగిపడిన శిథిలాల మధ్య విద్య నేర్చుకునేందుకు పరుగులు తీస్తున్న పిల్లల్ని చూస్తే నేర్చుకోవాలన్న కోరిక పిల్లలకు తప్ప మరెవరికి ఉంటుంది? ఈ విధ్వంసకారులు పాఠాలు ఎప్పుడు నేర్చు కుంటారు? యుద్ధ విధ్వంస వ్యూహరచన చేస్తున్న అమానవ దుష్టబుద్ధులకు ఎవరు బుద్ధిచెప్పాలి! ప్రపంచమంతా ఆ కృత్యాలను తిలకిస్తూనే ఉంది. ఎందుకు మానవ హృదయాలు గొంతులెత్తి నినదించడంలేదు మారణకాండను ఆపేవరకు! రేపటి ప్రపంచాన్ని నిర్మూలించే ఈ కర్కశులకు తగిన బుద్ధి చెప్పకుండా, అన్యాయమని ఊరుకుంటే హననం కొనసాగుతూనే ఉంటుంది.
ఉక్రెయిన్‌ యుద్ధంలో కానీ, ఇజ్రాయిల్‌ యుద్ధంలోకానీ ప్రపంచంలో దేశాల మధ్య జరిగే యుద్ధాలలో, అంతర్యుద్ధాలలో, మత, జాతి విద్వేష దాడులలో ఎక్కువగా బలి అవుతున్నది పిల్లలు, మహిళలు. బాంబుల భయాలకు ఇల్లూ పొల్లూ వొదిలి, గాయాలతో, ఆకలితో, అనారోగ్యాలతో మరణశయ్యపై విలపిస్తున్న జనగోడు హృదయ విదారకమై వినిపిస్తున్నది. ఇంతటి నరమేధానికి సామ్రాజ్యవాద ఆధిపత్య అహంకారమే కారణము. శాంతి చర్యలకు దేశాలు ఒకవైపు పిలుపునిస్తున్నా, బాంబులు కురిపించే దురహంకారుల వెనుక సామ్రాజ్యవాద దోపిడీ శక్తులు ఉండి ఉసిగొలుపుతున్నాయి. ”ఇజ్రాయిలో, ఆయిలో/అమెరికా కనుసన్నల్లో/ ఊపిరి పోసుకుంటున్న /మృత్యుగుళిక/ విచ్చుకత్తి విధ్వంసం” అని కవి వ్యాఖ్యానించింది యదార్థం. అయితే పిల్లలపై ఇంత యుద్ధహింస, మారణహోమం జరుగుతూంటే, ప్రధాన మీడియా, పత్రికలు కూడా పెద్దగా స్పందించడంలేదు. ప్రజలకూ చూసీ చూసీ, సాధారణమై పోయింది. ప్రతిస్పందనలూ పలుచపడిపోతున్నాయి. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతున్నారు. ఎంతో జీవితాన్ని ఇంకా గడపాల్సిన రేపటితరం, కల్మషాలెరుగని పిల్లలు కళ్లముందే రక్తపు ముద్దలవడం, యుద్ధాల మూలంగా దేశాలు విధ్వంసానికి గురవడం మానవజాతికే కళంకం.
యుద్ధ దుర్మార్గాలను, ప్రపంచపౌరులంగా వ్యతిరేకించాలి. ప్రపంచశాంతి, సామరస్యాలతో కొనసాగిన నాడే, మనమూ మన ప్రాంతమూ ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధిని పొందుతుంది. మనకెందుకులే అను కుంటే, రేపు ఈ ద్వేషపూరిత విధ్వంసాలు మన ముందుకూ వస్తాయి. పిల్లలు వర్థిల్లాలి! విధ్వంసం నశించాలి.